Fathima Beevi Passed Away : సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నర్ జస్టిస్ ఫాతిమా బీవీ కన్నుమూశారు. ఆమె గురువారం కేరళ.. కొల్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జస్టిస్ ఫాతిమా బీవీకి 96 సంవత్సరాలు. ఫాతిమా బీవీ మరణించినట్లు కేరళ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కేరళ మంత్రి సంతాపం..
జస్టిస్ ఫాతిమా బీవీ మృతిపై కేరళ మంత్రి వీణా జార్జ్ సంతాపం తెలిపారు. జస్టిస్ ఫాతిమా బీవీ మృతి బాధాకరమని అన్నారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా, తమిళనాడు గవర్నర్‌గా జస్టిస్ బీవీ తనదైన ముద్ర వేశారని తెలిపారు. 'జస్టిస్ ఫాతిమా బీవీ ధైర్యవంతురాలైన మహిళ. ఆమె పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. సంకల్ప శక్తి, మంచి ఉద్దేశం ఉంటే ఎటువంటి ప్రతికూలతలనైనా అధిగమించవచ్చని ఆమెను చూసి నేర్చుకోవచ్చు.' అని వీణా జార్జ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
'అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయికి'
Supreme Court First Woman Judge :జస్టిస్ఫాతిమా బీవీ.. 1927 ఏప్రిల్ 30న కేరళలోని పతనంతిట్టలో మీరా సాహిబ్, ఖదీజా బీవీ దంపతులకు జన్మించారు. పతనంతిట్టలోని పాఠశాల విద్యాభ్యాసం, తిరువనంతపురంలోని ఓ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. బీఎల్ను తిరువనంతపురంలో ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివారు. 1950వ సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కేరళలోని దిగువ న్యాయస్థానంలో జస్టిస్ ఫాతిమా బీవీ తన వృత్తిని ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదిగి 1983న హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989వ సంవత్సరంలో సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1992 ఏప్రిల్ 29న పదవీ విరమణ చేశారు జస్టిస్ ఫాతిమా బీవీ.
'రిటైర్ అయ్యాక తమిళనాడు గవర్నర్‌గా'
First Woman Governor Of Tamilnadu : రిటైరయ్యాక జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత 1997 నుంచి 2001 వరకు తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు.