వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కన్నతండ్రి.. తమ పేరిట ఉన్న ఆస్తిని ఆమెకు కట్టపెడతాడేమోనన్న భయంతో ఏకంగా అతడినే హత్య చేయించింది ఓ కుమార్తె. మహారాష్ట్ర నాగ్‌పుర్ జిల్లాలోని భివాపుర్ ప్రాంతంలో ఆరు రోజుల కిందట ఓ పెట్రోల్ బంక్ యజమాని దిలీప్ సొంటక్కే కొందరు దుండగలు చేతుల్లో హత్యకు గురయ్యారు. ముందుగా ఈ కేసులో అనుమానితులుగా భావించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని విచారించగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. కన్నకూతురే పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్‌తో తన తండ్రిని హత్య చేయించినట్లుగా పోలీసులు తేల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగ్‌పుర్ జిల్లాకు చెందిన మృతుడు దిలీప్ సొంటక్కే(60) పెట్రోల్ బంక్ నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. నాగ్‌పుర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భివాపుర్‌లో దిలీప్‌నకు పెట్రోల్ బంక్ వ్యాపారం ఉంది. అతడికి భార్య, 35 ఏళ్ల ప్రియ అనే కుమార్తె ఉన్నారు. అయితే తండ్రి దిలీప్ ఉమ్రేడ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఓ ప్లాట్‌లో నివాసం ఉండేవారు. ఈ విషయం కాస్త భార్య, కుమార్తెకు తెలియడం వల్ల ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. పలుమార్లు తల్లీకూతుళ్ల పేరు మీద ఉన్న పొలం, ఇళ్లు సహా మరికొన్ని ఆస్తులను దిలీప్ తన పేరిట బదిలీ చేయాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు.