పాతికేళ్ల క్రితం అయినవారికి దూరమైన ఓ వ్యక్తి.. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నాడు. తనను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని అనుకున్న అతడి కుమారుడు.. ఇన్ని సంవత్సరాల తర్వాత తండ్రిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నాన్నను హత్తుకుని, బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందబాష్పాలతో ముంచెత్తాడు. ఈ అపూర్వ కలయికకు రాజస్థాన్ భరత్‌పుర్‌లోని అప్నాఘర్ ఆశ్రమం వేదికైంది.
ఇది కథ కాదు..
సోమేశ్వర్ దాస్ది ఒడిశాలోని కటక్. మానసిక స్థితి సరిగా లేక 25 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చేశాడు. చివరకు రాజస్థాన్ భరత్‌పుర్‌లోని అప్నాఘర్ ఆశ్రమం అతడ్ని ఆదరించింది. అన్ని సౌకర్యాలు కల్పించి.. అవసరమైన వైద్యం చేయించింది. సోమేశ్వర్ చెప్పిన విషయాల ఆధారంగా అతడి కుటుంబసభ్యుల ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టింది.
కటక్‌లోని అతడి కుటుంబసభ్యులు మాత్రం దాదాపు రెండున్నర దశాబ్దాలు నరకం చూశారు. సోమేశ్వర్ కనిపించకుండాపోయిన తర్వాత చాలా ఏళ్ల పాటు అనేక చోట్ల గాలించారు. ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురుచూశారు. అయినా.. వారి ఆశలేవీ నెరవేరలేదు. ఇక చేసేది లేక.. గతేడాది, అంటే సోమేశ్వర్ తప్పిపోయిన 24 ఏళ్ల తర్వాత.. అతడు చనిపోయి ఉంటాడని నిర్ణయానికి వచ్చారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అవసరమైన పూజలు చేయించారు. భర్త లేడని వితంతువుగా జీవించడం మొదలుపెట్టింది సోమేశ్వర్ దాస్ భార్య సోనాలతా.