Father Sold Newborn Baby Boy In Odisha : ఒడిశా.. బలాంగిర్ జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. పేదరికం కారణంగా ఓ వ్యక్తి తన ఐదు రోజుల కుమారుడిని రూ.2.5 లక్షలకు అమ్మేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పసికందు తండ్రితో పాటు మధ్యవర్తిని అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..టిట్లాగఢ్ మండలంలోని ఝంకరాపద గ్రామంలో సంతోశ్ పాలెయి.. తన భార్య పుష్ప పాలీతో నివసిస్తున్నాడు. వీరికి ఇదివరకే పిల్లలు ఉన్నారు. తాజాగా పాలీ మరో మగబిడ్డకు జన్మనివ్వడం వల్ల.. ఆ భారాన్ని మోయలేకపోయారు దంపతులు. దీంతో పసికందును విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు మధ్యవర్తి షేక్ రంజాన్‌కు చెప్పారు. అనంతరం శిశువును కొనుగోలు చేసేందుకు భవానీపట్నాకు చెందిన రాజా అనే వ్యక్తి షేక్‌ను సంప్రదించాడు. దీంతో సంతోశ్ షేక్ రంజాన్ సహాయంతో తన 5 రోజుల శిశువును 2.5 లక్షలకు రాజాకు విక్రయించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. చిన్నారిని కొనుగోలు చేసిన రాజాను గుర్తించారు. అనంతరం సంతోశ్, షేక్ రంజాన్లపై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తల్లిదండ్రులను చంపిన కుమారుడు..
Son Killed Parents In Pradesh News : ఉత్తర్‌ప్రదేశ్.. ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులను కడతేర్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం ఘటనపై దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిచోర్ గ్రామంలో లక్ష్మీప్రసాద్ (58), విమల (55) దంపతులు.. తమ కుమారుడితో నివసిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తల్లిదండ్రులపై కర్రతో విచక్షణ రహితంగా దాడి చేశాడు వారి కుమారుడు. శనివారం ఉదయం చెత్త వ్యాన్ రావడం వల్ల హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. తాళం వేసి ఉన్న మొదటి అంతస్తు గది తలుపులు తెరిచారు. అప్పటికే నిందితుడి తండ్రి లక్ష్మీప్రసాద్ మృతి చెందాడు. అతడి తల్లి విమల తీవ్రంగా గాయపడి పడి ఉంది. ఆమెను వెంటనే వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
తండ్రిని చంపిన కసాయి కొడుకు...
Son Killed His Father In Uttarpradesh : ఉత్తర్‌ప్రదేశ్.. ప్రయాగ్‌రాజ్ జిల్లాలో డ్రగ్స్‌కు బానిసైన ఓ వ్యక్తి.. తన 65 ఏళ్ల తండ్రిని హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని 9 గంటల్లోనే అరెస్టు చేశారు. అటార్సుయా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 65 ఏళ్ల హన్సరాజ్ పెద్ద కుమారుడు ధీరేంద్ర సింగ్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. శుక్రవారం తండ్రీకుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ధీరేంద్ర అక్కడే ఉన్న చెక్కలతో తన తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని 9 గంటల్లో అరెస్టు చేశారు.
అప్పు తీర్చేందుకు చిన్నారి అమ్మకం.. డబ్బు కోసం స్నేహితుడిని కిడ్నాప్ చేసి..
ఆర్థిక ఇబ్బందులతో కుమార్తెను అమ్మకానికి పెట్టిన అమ్మ..!