బాలికపై అత్యాచారం జరిగిందన్న షాక్ నుంచి తేరుకోకముందే... ఆమె తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించడం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్ జిల్లాలో జరిగిందీ ఘటన.
అసలేం జరిగింది?
కాన్పుర్ జిల్లాలోని ఘటమ్పుర్ ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని.. సోమవారం(మార్చి 8న) పశువులకు మేత తీసుకురావడానికి బయటకు వెళ్లింది. గోలు యాదవ్, దీపు అనే ఇద్దరు నిందితులు.. ఆ 13 ఏళ్ల బాలికను అపహరించి.. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
అయితే విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. పరీక్షల కోసం బాధితురాలిని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. బాలికను ఆసుపత్రిలో ఉంచి.. అతను టీ తాగడానికి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఓ ట్రక్కు వచ్చి అతన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడ్ని లాలా లజ్‌పతి రాయ్(ఎల్ఎల్ఆర్) ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రణాళిక ప్రకారమే ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు గోలు యాదవ్‌ను అరెస్టు చేసినట్లు కాన్పుర్ డిప్యూటీ ఐజీ ప్రీతిందర్ సింగ్ తెలిపారు. గోలు సోదరుడు సౌరభ్, స్నేహితుడు దీపు కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
గోలు ఓ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ కుమారుడు కావడం గమనార్హం.