లూడో గేమ్ ఆడుతున్నాడనే కోపంతో ఓ బాలుడిని చితకబాదాడు తండ్రి. దాంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుట్టుచప్పుడు కాకుండా తన సోదరుడు, మరో వ్యక్తితో కలిసి నది ఒడ్డున పూడ్చిపెట్టాడు తండ్రి. ఎవరికైనా చెబితే చంపేస్తానని భార్యను బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్, ఆజమ్గఢ్ జిల్లాలోని రౌనాపార్ పోలీస్ స్టేషన్ పరిధి, మహులా బాగీచా గ్రామంలో వెలుగు చూసింది.
ఇదీ జరిగింది: మహులా బాగీచా గ్రామానికి చెందిన బాలుడు లక్కీ(8) గత శనివారం ఇంటి సమీపంలో మేకలు కాస్తూ.. తన మొబైల్లో లూడో ఆడుకుంటున్నాడు. లూడో ఆడటాన్ని గమనించిన అతడి తండ్రి జితేంద్ర.. ఆగ్రహంతో తీవ్రంగా చితకబాదాడు. ఇంటికి తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేశాడు. అతడికి తీవ్ర గాయాలు కావడం వల్ల 9.30 గంటల ప్రాంతంలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతుదేహాన్ని ఖననం చేయాలని నిర్ణయించుకున్నాడు జితేంద్ర. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తన భార్య బబితాను బెదిరించాడు. ఆ తర్వాత తన సోదరుడు ఉపేంద్ర, మరో వ్యక్తి రామ్జనమ్ సాయంతో ఓ వస్త్రంలో చుట్టి.. మహులా దేవర్ గ్రామంలోని ఘాఘరా నది ఒడ్డున పూడ్చి పెట్టారు.