తమిళనాడు తిరుచ్చిలో దారుణం జరిగింది. వివాహానికి ముందే గర్భం దాల్చినందుకు కుమార్తెను హత్య చేశారు ఆమె తండ్రి, అత్త. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముక్కోంబు ప్రాంతంలోని రామావతలై కాలువ ఒడ్డున డిసెంబరు 5న అప్పుడే పుట్టిన మగశిశువును ఎవరో బహిరంగ ప్రాంతంలో వదిలేసినట్లు స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో ఎలమనూర్‌కు చెందిన ఓ కళాశాల విద్యార్థిని (19) ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆ విద్యార్థిని విష ప్రభావంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించి వెంటనే తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. వివాహానికి ముందే ఆమె గర్భం దాల్చడం వల్ల బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడైంది. ఈ విషయం తెలియడం వల్ల ఆమె తండ్రి సెల్వమణి, మేనత్త మల్లికతో కలిసి ఆ బాలికతో బలవంతంగా పురుగుల ముందు తాగించారని తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.