Father Killed And Burnt His Daughter :కర్ణాటక కోలార్‌లో పరువు హత్య కలకలం రేపింది. పెళ్లి చేసిన తర్వాత కూడా ప్రియుడితో మాట్లాడుతోందని 17 ఏళ్ల కూతురిని హత్య చేశాడు ఓ తండ్రి. కర్రతో కొట్టి హత్య చేసి మృతదేహాన్ని కాల్చివేశాడు. అనంతరం తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటన ఈ ఏడాది మేలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది
ములబగిళు తాలుకాలోని ముస్తురు గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తికి కూతురు ఉంది. ఈమె గత కొన్ని రోజులుగా తన కజిన్‌తో ప్రేమలో ఉంది. దీనిని గమనించిన తండ్రి రవి ఆమెను వారించాడు. అతడితో మాట్లాడవద్దని హెచ్చరించాడు. అయినా తండ్రి మాట వినని బాలిక, ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. ఎంత చెప్పినా ఆమె వినకపోవడం వల్ల మరొకరితో పెళ్లి చేస్తే మారుతుందని భావించాడు రవి. దీంతో కృష్ణాపుర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఏప్రిల్‌లో బాల్య వివాహం చేశాడు. అనంతరం అత్తవారింటికి వెళ్లిన బాలిక తన ప్రేమయాణం కొనసాగించింది. పెళ్లి అయిన తర్వాత కూడా తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. దీంతో ఆగ్రహించిన ఆమె భర్త, రవికి ఫోన్ చేసి తన భార్యను తీసుకెళ్లాలని సూచించాడు.