కుమార్తెకు రైతు ఎకో ఫ్రెండ్లీ వివాహం.. కట్నంగా ఆవు.. సేంద్రియ పదార్థాలతో విందు భారతదేశం ఎన్నో సంప్రదాయలకు నిలయం. వివిధ సంస్కృతుల సమ్మేళనం. ఇప్పుడు విదేశీ సంస్కృతులకు అలవాటు పడ్డ జనం మన దేశ ఆచారాలను మరచిపోతున్నారు. అదే విధంగా ప్లాస్టిక్‌ను విపరీతంగా వినియోగిస్తూ పర్యావరణ హానికి కారణమవుతున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భావితరాల మనుగడ కష్టంగా మారుతుందని భావించిన ఆ వ్యక్తి.. తన కూతురి వివాహాన్ని వినూత్నంగా చేయాని అనుకున్నాడు. అందుకోసం పూర్తిగా సంప్రదాయ పద్దతిలో, ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణహితంగా వివాహాన్ని జరిపించాడు.
గుజరాత్ సూరత్‌కు చెందిన విపుల్ పటేల్ ఓ రైతు. తన కూతురు రిద్ధి పెళ్లిని అందరిలాగే ఘనంగా చేయాలనుకున్నాడు. కానీ, పెళ్లి ద్వారా ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం వివాహాన్ని సంప్రదాయబద్ధంగా, పర్యావరణహితంగా జరిపించాలని భావించాడు. వివాహా ఆహ్వాన పత్రికల నుంచే ఈ విధానాన్ని పాటించాలని నిశ్చయించుకున్నాడు. బంధువులకు తులసి విత్తనాలతో కూడిన వివాహ పత్రికలను అందించాడు. ఈ విత్తనాలను మట్టిలో నాటి పెంచాల్సిందిగా వారిని కోరాడు.
పర్యావరణహితంగా కూతురి పెళ్లి చేసిన తండ్రి
"విపుల్ పటేల్ నా స్నేహితుడు. వంటకాల మెనూ మొత్తం కెమికల్స్ లేకుండా, ఆర్గానిక్‌వే ఉండేలా ఏర్పాటు చేశాం. ఈ విషయంలో అస్సలు రాజీ పడలేదు. నీళ్ల గ్లాసుల దగ్గర నుంచి ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా పేపర్ కప్పులనే వాడం."
-జైదీప్ పటేల్, విపుల్ పటేల్ స్నేహితుడు
పెళ్లి సమయంలో వధువరూలను ఎద్దుల బండిలోనే మండపానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశాడు విపుల్ పటేల్. కన్యాదానం చేసేటప్పుడు కూతురికి ఒక గిర్ జాతి ఆవును కానుకగా ఇచ్చాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులతోనే వంటకాలు తయారు చేయించాడు. ఎటువంటి రసాయనాలు కలపని వంటలతోనే విందును ఏర్పాటు చేశాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించకుండానే వేడుక చేశాడు. తినే కంచాలు, నీళ్ల గ్లాసులు సహా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు విపుల్ పటేల్. రీయూజ్ చేయగలిగే వస్తువులనే ఉపయోగించాడు. వివాహానికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా విపుల్ పటేల్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.
పర్యావరణహితంగా కూతురి పెళ్లి చేసిన తండ్రి