ఉత్తరప్రదేశ్ల్ని ఫిరోజాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నకూతురు పట్ల తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. 36 ఏళ్ల పాటు కుమార్తెను ఇంట్లోనే బందీ చేశాడు. 17 ఏళ్ల వయస్సులో ఆమెను ఓ గదిలో పెట్టి.. గొలుసుతో కట్టేశాడు. అప్పటి నుంచి ఆమె అందులోనే ఉండిపోయింది. ఎండ, వాన, వెలుగు ఇలాంటివేవీ ఆమెకు తెలియదు. అయితే ఇటీవల ఈ విషయం బయటకు తెలియడం వల్ల ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళా బృందం ఆమెకు విముక్తి కలిగించింది.
ఇదీ జరిగింది..
ఫిరోజాబాద్ తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సప్నా జైన్ (53)కు మానసికస్థితి సరిగ్గా ఉండేది కాదు. ఆ కారణంతో సప్నా తండ్రి 36 ఏళ్ల కిందట ఆమెను గదిలోకి తీసుకెళ్లి.. గొలుసుతో కట్టేసి బంధించాడు. అప్పుడు సప్నా వయస్సు 17 ఏళ్లు. అప్పటి నుంచి గదిలో ఉన్న సప్నాకు ఆమె కుటుంబ సభ్యులు తలుపు కింద నుంచి భోజనం పంపించేవారు. ఆ గదిలోనే సప్నా.. మల మూత్ర విసర్జన కూడా చేసేది. కిటికీలో నుంచి నీళ్లు పోస్తూ ఆమెకు స్నానం చేయించేవారు. అలా ఆమె 36 ఏళ్లుగా గది దాటి బయటకు రాలేదు.
సప్నాతో మాట్లాడుతున్న ఎన్జీవో మహిళా సభ్యులు సప్నా తండ్రి గిరీష్ చంద్ కొద్ది నెలల క్రితం చనిపోయాడు. తాజాగా సప్నా గురించి తెలుసుకున్న స్థానిక స్వచ్ఛంద సేవా భారతి సభ్యులు ఆమె ఇంటికి వెళ్లారు. బాధితురాలి పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే ఆమెను బయటకు తీసుకొచ్చి స్నానం చేయించారు. కొత్త బట్టలు అందించారు. తర్వాత సప్నా గురించి ఆగ్రా మాజీ మేయర్, హత్రాస్క్ చెందిన స్థానిక భాజపా ఎమ్మెల్యే అంజులా మహౌర్‌కు చెప్పారు. వారు అధికారులతో కలసి వచ్చి సప్నాను విడిపించారు. వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో ఎన్జీవీ మహిళా సభ్యులతో సప్నా బాధితురాలిని చూసినప్పుడు దారుణ పరిస్థితిలో ఉందని, తమ ఎన్జీఓ సభ్యులు స్నానం చేయించి.. శుభ్రమైన దుస్తులు అందించారని సేవా భారతి సీనియర్ సభ్యురాలు నిర్మలా సింగ్ చెప్పారు. తర్వాత ఎమ్మెల్యే మౌహర్ సప్నా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారని చెప్పారు. కొన్ని వారాల్లోనే ఆమె మానసిక స్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నామని డాక్టర్ దినేశ్ అన్నారు.