తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బావిలో పడి తండ్రి సహా ఇద్దరు కుమారులు మృతి.. ఎలుకల మందు తాగి కుటుంబం సూసైడ్​! - two labour died in oil tanker kolkata

బావి శుభ్రం చేయడానికి వెళ్లి తండ్రితో సహా ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఈ ఘటన హిమాచల్​ ప్రదేశ్​లో జరిగింది. మరో ఘటనలో కోల్​కతాలో ఆయిల్​ ట్యాంకర్​లో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మరోవైపు, ఎలుకల మందు తాగి.. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

Father and two sons died in Hamirpur
Father and two sons died in Hamirpur

By

Published : Apr 22, 2023, 10:26 PM IST

హిమాచల్​ప్రదేశ్​లో ఘోరం జరిగింది. బావిని శుభ్రం చేసేందుకు దిగి.. తండ్రితో సహా ఇద్దరు కుమారులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మహోబా జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేంద్ర కుమార్ వర్మ (58).. అతడి కుమారులు దేవేంద్ర కుమార్ (28), చంద్ర ప్రకాష్ (23) మహోబా జిల్లాలోని ఖన్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని మావాయి ఖుర్ద్ గ్రామంలో ఓ బావిని శుభ్రం చేసి.. మోటారు బిగించేందుకు అందులో దిగారు. ఎంతసేపటికీ బావిలో నుంచి వారి గొంతు వినబడలేదు. దీంతో వీరేంద్ర అన్నయ్య రామ్ కరణ్ గ్రామస్థులతో కలిసి బావిలోకి దిగేసరికి ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమై ముగ్గురినీ బావిలో నుంచి బయటకు తీసి సమీపంలోని మౌఢా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మౌఢా పోలీసులు.. ఖన్నా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఖన్నా పోలీసులు పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, పోస్టుమార్టం నివేదిక తర్వాతే మరణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఆయిల్​ ట్యాంకర్​లో పడి ఇద్దరు కార్మికులు మృతి..
కోల్​కతాలో దారుణం జరిగింది. ఆయిల్​ ట్యాంకర్​లో ఆయిల్​ కొలవడానికి దిగిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిలజాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 7వ నంబర్‌ రహదారిలో ట్యాంకర్‌లో ఆయిల్‌ లోడింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఇద్దరు కార్మికులు ట్యాంకర్ లోపల చమురు స్థాయిని కొలుస్తున్నారు. అందులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కాలు జారి ట్యాంకర్‌లో పడిపోయాడు. పక్కనే ఉన్న మరో కార్మికుడు ఆయిల్​ ట్యాంకర్​పై నుంచి అతడిని లాగేందుకు ప్రయత్నించగా.. అతడు కూడా అందులోనే పడిపోయాడు. సమాచారం అందుకున్న తిలజాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళం, కోల్‌కతా పోలీసు డీఎమ్​జీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి ఇద్దరు కార్మికులను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

కాగా, ఆయిల్​ ట్యాంకర్​లో ఊపిరి ఆడకపోవడమే కార్మికులు చనిపోవడానికి కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా ట్యాంకర్​లో ఆయిల్ లోడింగ్ సమయంలో భద్రతా చర్యలు తీసుకున్నారా లేదా అని పోలీసులు తనిఖీ చేశారు.

పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్య!
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు శవమై కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రాయ్​పుర్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తుకేశ్వర్ సోంకేవ్రే అనే వ్యక్తి (30), అతడి భార్య నిక్కి (26), కుమారుడు నిహాల్‌తో రాయ్​పుర్​ జిల్లా ఖరోరా ప్రాంతంలోని మోతింపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే శనివారం అతడి కుటుంబ సభ్యులు ఫోన్​ చేయగా ఎత్తలేదు. అనుమానంతో తుకేశ్వర్ ఇంటికి వెళ్లారు కుటుంబ సభ్యులు. తలుపులు తెరిచి చూసేసరికి తుకేశ్వర్​ పైకప్పునకు వెళాడుతూ ఉన్నాడు. కింద మంచంలో నిక్కి, నిహాల్​ మృతదేహాలు పడిఉన్నాయి. వారి పక్కన ఎలుకల మందు ఖాళీ సీస కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని రాయ్​పుర్​ రూరల్​ ఎస్పీ చంద్రకర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details