భూతాపం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎన్ని చెట్లు పెంచితే పర్యావరణానికి అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో మనుషులు, ఇతర జీవుల నివాసానికి సరిపడే వాతావరణం భూమిపై ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. పర్యావరణ స్పృహతో, సామాజిక బాధ్యతతో పెద్దసంఖ్యలో చెట్లను పెంచుతున్న వారు అక్కడక్కడా కనిపిస్తారు. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ గుర్ముఖ్ సింగ్ ఆ కోవకే చెందుతారు. పచ్చదనం అన్నా, గార్డెనింగ్ అన్నా ఆయనకు అమితాసక్తి. 35 ఏళ్ల నుంచీ బొన్సాయ్ విధానంలో చెట్లను పెంచుతున్నాడు. ఈ మొక్కలకు ప్రత్యేక పోషకాలు అందిస్తూ, కన్న బిడ్డల్లా సాకుతున్నాడు గుర్ముఖ్ సింగ్.
''నా తోటలో 1500 మొక్కలున్నాయి. ఈ మొక్కలన్నీ ట్రేలలో కొంత ఎత్తు వరకే పెరుగుతాయి. ఆ ట్రేను బొన్ అంటారు. బొన్‌లో పెరిగే మొక్కను సాయ్ అంటారు. బొన్సాయ్ మొక్కలు బతకాలంటే సరైన సంరక్షణ, నిర్వహణ అత్యవసరం. లేకపోతే అవి చనిపోతాయి. వీటికి ఎరువు కూడా ద్రవరూపంలోనే అందించాలి.''
-గుర్ముఖ్ సింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్
గుర్ముఖ్ సింగ్ తన ఇంటి మిద్దెపై 130 యార్డుల స్థలంలో బొన్సాయ్ విధానంలో మొక్కలు పెంచుతున్నాడు. అంతరించిపోయే దశలో ఉన్న ఎన్నో రకాల బొన్సాయ్‌లు, కనుమరుగైపోతున్న మొక్కలు గుర్ముఖ్ సింగ్ తోటలో కనిపిస్తాయి.
''ఎక్కడ భవన నిర్మాణ పనులు ప్రారంభించినా.. ముందుగా ఆ ప్రాంతంలోని చెట్లన్నీ నరికేస్తాం. ఫలితంగా పంజాబ్‌లో చాలా చెట్లు కనుమరుగయ్యాయి. చెట్ల పెంపకంలో మా అమ్మే నాకు స్ఫూర్తి. తర్వాత ఓ ప్రొఫెసర్ ఈ గార్డెన్‌ను తయారుచేశారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. గత 20 ఏళ్ల నుంచీ, పంజాబ్ విశ్వవిద్యాలయంలో జరిగే ఫ్లవర్ షోలో.. బొన్సాయ్ పూలను మేమే ప్రదర్శనకు ఉంచుతున్నాం. ఇప్పుడైతే ఈ ప్రదర్శనకు చాలా మందే వస్తున్నారు. బొన్సాయ్‌ల పెంపకంపై ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నా.''
-గుర్ముఖ్ సింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్
మొక్కలు ఆక్సీజన్‌ను ఇవ్వడమే కాదు..మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయనీ, ఒత్తిడిని తగ్గిస్తాయనీ చెప్తున్నాడు గుర్ముఖ్ సింగ్. ఫలితంగా ఎన్నో వ్యాధులు దరిచేరకుండా ఉంటాయంటున్న గుర్ముఖ్.. చెట్లు మంచి మిత్రులని అంటున్నాడు.