కుమార్తె చేసిన తప్పుడు ఆరోపణలు ఓ తండ్రిని ఐదున్నరేళ్లపాటు కటకటాల పాల్జేశాయి. తన ప్రేమను అంగీకరించలేదని ఓ బాలిక తండ్రిపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసులో ఐదున్నర సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
అసలేమైందంటే
ప్రేమ విషయంలో తండ్రి తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడని బాలిక ఈ దుస్సాహసానికి పాల్పడింది. అంధేరీకి చెందిన బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం ఆమె తండ్రికి తెలిసింది. ప్రియుడి కోసం తన కుమార్తె నగలు అలంకరించుకుని వెళ్లడం తండ్రికి నచ్చలేదు. దీంతో ఆమెను హెచ్చరించాడు. అయినా బాలిక.. తన తండ్రి మాటను వినలేదు. కోపంతో తండ్రి ఆమెను కొట్టాడు. ఆ కోపంతోనే బాలిక తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తన తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 2017లో పాఠశాల టీచర్‌కు బాలిక తప్పుడు సమాచారం ఇచ్చింది. 2016 నుంచి సంవత్సరం వ్యవధిలో నెలకు నాలుగు సార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది. అయితే, అవి తప్పుడు ఆరోపణలు అని తెలియని టీచర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వచ్ఛంద సంస్థతో కలిసి.. అంధేరిలోని డీఎన్ నగర్ పోలీసులకు బాలిక తండ్రిపై కంప్లైంట్ ఇచ్చారు. దీంతో బాలిక తండ్రి 2017లో అరెస్టు అయ్యాడు. అనంతరం బాలిక, టీచర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.