దేశంలోనే అతిపెద్ద మర్రి వృక్షం దేశంలోనే అతిపెద్ద మర్రి చెట్టు పంజాబ్‌లోని శ్రీఫతేగఢ్ సాహిబ్‌లో దర్శనమిస్తుంది. చొల్తీ ఖేరీకి చేరుకోగానే ఓ భారీ వృక్షం స్వాగతం పలుకుతుంది. పచ్చని పొలాల మధ్య ఉండే ఈ మర్రిచెట్టు... గొడుగులా విస్తరించి 6 నుంచి 7 హెక్టార్ల మేర నీడనిస్తుంది. ఈ చెట్టు 300 ఏళ్ల క్రితం నాటిదని స్థానికులు చెప్తారు. కాయకల్ప వృక్షమనీ, బరోటీ సాహిబ్ అని దీనికి మారుపేర్లు. చుట్టుపక్కల పొలాల్లోకి కాయకల్ప వృక్షం వేర్లు విస్తరించాయని చెప్తున్నారు అక్కడి రైతులు.
" ఓ పది పదిహేనేళ్ల క్రితం గోవింద్‌గఢ్ అటవీ విభాగం నుంచి ఓ అధికారి వచ్చి, ఈ చెట్టు ఎంత దూరం నీడనిస్తుందో కొలిచాడు. 4 నుంచి 5 ఎకరాలకు ఈ చెట్టు విస్తరించింది. ఇప్పుడైతే ఏకంగా ఆరు నుంచి ఏడెకరాల వరకూ విస్తరించింది. చెట్టు వేర్లు పెరిగిన మేర భూములన్నింటినీ సాగు చేయకుండా వదిలేస్తున్నారు."
- స్థానికుడు
వేర్లు కత్తరించాలని చూస్తే..
ఓసారి ఓ భూయజమాని ఈ చెట్టు వేర్లు కత్తిరించాలని ప్రయత్నించగా.. ఆయన చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి బరోటీ సాహిబ్ వేర్లు విస్తరించి ఉన్న పరిధిలోని భూములను ఎవరూ సాగు చేయడంలేదు. ఆ చెట్టు కలప, ఆకులు వాడుకునేందుకు కూడా స్థానికులు భయపడతారు.
" మా ఊరికి చెందినాయన ఒకరు చెట్టు కొట్టేందుకు ప్రయత్నించాడు. తర్వాత కొద్దిరోజులకే ఆయన చనిపోయాడు. ఆకు కాదు కదా ఆ మహావృక్షం కిందనుంచి ఏదైనా తెచ్చుకోవడానికి కూడా ఎవరూ ధైర్యం చేయరు. కలప వాడుకోవాలనుకుంటే ఆ చెట్టుదగ్గర మాత్రమే వాడుకోవాలి. అంతే తప్ప ఒక్క చెక్కముక్కను కూడా ఆ ప్రాంతం నుంచి బయటికి తీసుకురాకూడదు. ఎవరైనా అలా చేసేందుకు ప్రయత్నిస్తే చూపు కోల్పోయి, అంధులుగా మారతారు. "
- స్థానికుడు
ప్రచారంలో మరో కథ..
ఈ చెట్టు గురించి మరో పాత కథ కూడా ప్రచారంలో ఉంది. ఓ రైతు తన పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా...ఓ ముని అటువైపునుంచి వెళ్తున్నాడట. కొద్దిరోజులు తమ కుటుంబంతో ఉండమని ఆ మునిని వేడుకుంటాడట రైతు. చాలారోజులపాటు ఆయనకు సేవలు చేస్తుంది రైతు కుటుంబం. ఓరోజు తనకు భోజనం పెట్టేందుకు వెళ్లిన రైతు భార్య ముఖం విచారంగా ఉండడం గమనించిన ముని...కారణమేంటని అడుగుతాడు. ఇంతవరకూ సంతానం కలగకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తుంది రైతు భార్య. తన బాధ వర్ణిస్తున్న సమయంలో మహాశివుడిని పూజించిన ముని...ప్రసాదం ఇచ్చి, దాన్ని తింటే కోరిక నెరవేరుతుందని ఆమెకు చెస్తాడు. ఇంటికొచ్చి, భర్తకు జరిగినదంతా వివరిస్తుంది. భార్య మాటలు పట్టించుకోని రైతు.. అలాంటివేవీ తమకు సంతానభాగ్యం కలిగించవని కొట్టిపారేస్తాడు. ముని ఇచ్చిన ప్రసాదాన్ని దంపతులు పొలాల్లోకి విసిరేస్తారు. ఆ చోటే ఈ మహావృక్షం ఉందని నమ్మిక.
" ఈ మర్రిచెట్టు ఇంత వేగంగా పెరుగుతుండడం ఆశ్చర్యంగా ఉంది. ఓ మనిషి వృద్ధుడై 80 లేదా వందేళ్లలో చనిపోతాడు. అలాగే, చెట్టు నుంచి పాత బెరడు క్రమంగా రాలిపోతూ, కొత్త బెరడు పుట్టుకొస్తుంది. 13 నుంచి 15 బిగాల భూమిలో ఈ మర్రిచెట్టు విస్తరించింది."
- స్థానికుడు
మర్రిచెట్టు వేర్లు విస్తరించిన ప్రాంతం పెరుగుతున్నట్లుగానే...గ్రామంలో రైతు కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతోందని స్థానికులు చెప్తున్నారు. మర్రిచెట్టు ముందు కోరుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయని వారు నమ్ముతారు. సిద్ధబాబా బరోటీ సాహిబ్ పేరుతో ఈ మహావృక్షాన్ని గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా కొలుస్తున్నారు. ప్రస్తుతం కాయకల్ప వృక్షం ఎన్నో వేల పక్షులకు ఆశ్రయంగా మారింది. గొడుగులా విస్తరించిన ఈ చెట్టు ఎప్పుడూ పక్షుల కిలకిలారావాలతో కళకళలాడుతూ చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి: 'వందల కోట్ల నిధి ఉన్నా బాధితులకు సాయమేది?'