తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు దిల్లీ సరిహద్దులో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ - రైతుల ఆందోళన

సాగు చట్టాలకు వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా నేడు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టనున్నారు రైతులు. దీక్షా స్థలి నుంచి కుండ్లి-మనేసర్​-పల్వాల్​ వరకు వాహనాల ప్రదర్శన కొనసాగనుంది. ఈ నెల 26న దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే ట్రాక్టర్ల కవాతుకు దీనిని ముందస్తు కసరత్తుగా భావిస్తున్నారు.

FARMERS TROCTOR RALLY
నేడు దిల్లీ సరిహద్దులో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ

By

Published : Jan 7, 2021, 5:08 AM IST

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యాన్ని సాధించే వరకూ వెనకడుగు వేయబోమని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు స్పష్టం చేశారు. వర్షం కారణంగా బుధవారం వాయిదాపడిన ట్రాక్టర్ల ర్యాలీని గురువారం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీక్షా స్థలి నుంచి కుండ్లి-మనేసర్‌-పల్వాల్‌ వరకు వాహనాల ప్రదర్శన కొనసాగనుంది. ఈ నెల 26న దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే ట్రాక్టర్ల కవాతుకు దీనిని ముందస్తు కసరత్తుగా భావిస్తున్నారు. తీవ్ర చలితో పాటు నాలుగు రోజులుగా వర్షం పడుతున్నప్పటికీ దీక్షా శిబిరాల్లో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. దిల్లీ సరిహద్దుల్లో రైతుల బైఠాయింపు ప్రారంభమై గురువారానికి 43వ రోజుకు చేరుకుంది. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వేల మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

కవాతుకు మహిళా రైతులు

గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించదలచిన ట్రాక్టర్ల కవాతులో పాల్గొనేందుకు హరియాణాకు చెందిన గ్రామీణ మహిళా రైతులు 200 మంది డ్రైవింగ్‌లో తర్ఫీదు పొందుతున్నారు. ట్రాక్టర్లతో పొలం దున్నడం వారికి తెలిసినప్పటికీ నగరంలో, జాతీయ రహదారులపై వాహనాల రద్దీ మధ్య ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా స్వయంగా నడిపేందుకు శిక్షణ తీసుకుంటున్నట్లు జింద్‌ ప్రాంతానికి చెందిన కిసాన్‌ ఏక్తా మహిళా మోర్చా అధ్యక్షురాలు షీయోకాంత్‌ తెలిపారు.

విస్కాన్‌సిన్‌ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ మద్దతు

భారత్‌లో ఉద్యమిస్తున్న రైతులకు అమెరికాలోని విస్కాన్‌సిన్‌ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాబిన్‌ జె వోస్‌ మద్దతు తెలిపారు. కర్షకుల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధూకు ఆయన లేఖ రాశారు. అమెరికాలో ఉన్న భారతసంతతి ప్రజల ప్రతినిధిగా తాను ఈ వినతిని సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విస్కాన్‌సిన్‌లో సిక్కులు గణనీయ సంఖ్యలో ఉన్నారు.

కొత్త చట్టాలకు లాల్‌బహదుర్‌ శాస్త్రి మనుమడి సమర్థన

కొత్త సాగు చట్టాలను దివంగత మాజీ ప్రధాని లాల్‌ బహదుర్‌ శాస్త్రి మనుమడు సంజయ్‌నాథ్‌ సింగ్‌ సమర్థించారు. అఖిలభారత రైతుల సంఘం(ఏఐఎఫ్‌ఏ) అధ్యక్షుడు అయిన సంజయ్‌నాథ్‌ నేతృత్వంలో ఓ బృందం బుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను కలిసింది. ఈ నెల 8న రైతులతో జరగనున్న 8వ దఫా చర్చల కోసం కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. వ్యవసాయ ఒప్పందాల పర్యవేక్షణకు ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయ ధరల నియంత్రణకు ప్రత్యేక ప్రాధికార సంస్థను నెలకొల్పడం వంటివి దానిలో ఉన్నాయి. కనీస మద్దతు ధరలు, కొత్త చట్టాలపై కొన్ని రాజకీయ శక్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సంజయ్‌నాథ్‌ ఆరోపించారు.

రైతులు ఇప్పటికైనా గ్రహించాలి: తోమర్‌

కొత్త వ్యవసాయ చట్టాలకు దేశవ్యాప్తంగా రైతుల మద్దతు లభిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. సంస్కరణలు తీసుకురావడంలోని ప్రభుత్వ ఉద్దేశాన్ని నిరసనకు దిగిన రైతులు అర్థంచేసుకోవాలని కోరారు. రైతు సంఘాల నేతలు కర్షకుల ప్రయోజనాలపై దృష్టిసారించి, సమస్య పరిష్కారంలో ప్రభుత్వానికి సహకరిస్తారన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:యూఎస్​ క్యాపిటల్​ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్​ శాంతి మంత్రం

ABOUT THE AUTHOR

...view details