దేశ రాజధాని సరిహద్దులను దిగ్బంధించిన రైతులు గురువారం ట్రాక్టర్ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు దిల్లీ సరిహద్దు నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు ఆందోళన ప్రాంతాల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
సింఘు-టిక్రి, టిక్రి-షాజహనపుర్, గాజీపుర్-పల్వాల్, పల్వాల్-గాజీపుర్ మధ్య ర్యాలీ ఉండనుందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి వివరించింది. జనవరి 26న నిర్వహించే కిసాన్ ర్యాలీకి ఇది రిహార్సల్ అని పేర్కొంది.
సమస్య పరిష్కారంపై కేంద్రానికి శ్రద్ధ లేదని అర్థమవుతోందని సమన్వయ సమితి వ్యాఖ్యానించింది. ఇతర రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపడం, సవరణలతో సరిపెడతామనడం సరికాదని పేర్కొంది. ఈ నెల 8న కేంద్రం రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే... ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేసింది. 13, 14 తేదీల్లో లోహ్రి, మకర సంక్రాంతి సందర్భంగా సాగు చట్టాల ప్రతులను దహనం చేయనున్నట్లు వెల్లడించింది. 18న మహిళా కిసాన్ దివస్ పేరిట, 23న నేతాజీ జయంతి సందర్భంగా ఆజాద్ కిసాన్ ఆందోళనలు చేపడతామని వివరించింది. 26న దిల్లీలో ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్ నిర్వహిస్తామని తెలిపింది.
శాస్త్రి మనవడు మద్దతు
మరోవైపు, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు సంజయ్ నాథ్ సింగ్ వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించారు. ఈ చట్టాలు తీసుకురావడాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమైన ఆయన.. రైతులతో చర్చల కోసం కేంద్రానికి పలు సూచనలు చేశారు.