వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ ఉద్యమానికి పిలుపునిచ్చింది రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్(ఆర్‌కేఎంఎస్). చట్టాలను ఉపసంహరించడం సహా, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్లు నెరవేరే వరకు ఒక్కో గ్రామం నుంచి ఐదుగురు రైతులు.. ప్రతి రోజు ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేపడతారని ఆర్‌కేఎంఎస్ తెలిపింది. డిమాండ్లు నెరవేరే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సందేశాలు పంపిస్తామని వెల్లడించింది.
గణతంత్ర దినోత్సవం రోజున హింస జరిగిన తర్వాత దిల్లీ సరిహద్దులో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఉపసంహరించుకున్న ఆర్‌కేఎంఎస్.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 21 రైతు సంఘాలతో యూపీ కిసాన్ మజ్దూర్ మోర్చా(యూపీకేఎంఎం)ను ఆదివారం ఏర్పాటు చేసింది.
దిల్లీకి రాలేరని...
ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్‌తో మాట్లాడిన ఆర్‌కేఎంఎస్ అధ్యక్షుడు వీఎం సింగ్.. దేశంలోని వ్యవసాయదారుల్లో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, వారికి దిల్లీ వచ్చేంత స్తోమత లేదని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు ఇతర పనులు ఉంటాయి కాబట్టి ఇంటి నుంచే వారు నిరసన తెలిపేలా ఈ ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
ఈటీవీ భారత్‌తో వీఎం సింగ్.
"ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కో గ్రామంలోని ఐదుగురు రైతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపడతారు. వ్యవసాయ చట్టాలపై తమకు ఉన్న అభ్యంతరాల గురించి ప్రధానమంత్రికి వివరించేందుకు రెండు నిమిషాల వీడియోను రికార్డు చేస్తారు. ఆ వీడియోను మా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. గోధుమ పంటకు రైతులు ఆశించిన స్థాయిలో మద్దతు ధర వచ్చేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 65 వేల పంచాయతీలు ఉన్నాయి. అందులో కనీసం 20 వేల గ్రామాలు ఉద్యమంలో పాల్గొన్నా.. ప్రధానికి ప్రతి రోజు లక్ష సందేశాలు వెళ్తాయి. ఆ లెక్కన నెలకు 30 లక్షల సందేశాలు మోదీకి వెళ్తుంటాయి. 20 వేల గ్రామాలకే ఇలా ఉంటే.. 50 వేల గ్రామాలు పాల్గొంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అప్పుడు కూడా ఈ సందేశాలు రైతుల నుంచి రావడం లేదని మోదీ చెప్తారా?"
-వీఎం సింగ్, ఆర్‌కేఎంఎస్ అధ్యక్షుడు
ఉద్యమాన్ని విజయవంతం చేయడమే కాకుండా, రైతుల మధ్య సోదరభావాన్ని పెంచేందుకు గ్రామంలోని ప్రతి కుటుంబం పిడికెడు ధాన్యాన్ని దానం చేయాలని పిలుపునిచ్చారు సింగ్. ఈ ధాన్యాన్ని ప్రతివారం నిర్వహించే ఉచిత భోజన కార్యక్రమంలో ఉపయోగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:కొవిడ్ కట్టడికి కేంద్రం ప్రత్యేక బృందాలు