వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మంగళవారం జరిపిన చర్చలు ఓ కొలిక్కి రాకుండానే ముగిశాయి. సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రెండున్నర గంటలకుపైగా సాగిన భేటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేద్దామని మంత్రులు చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. ఈనెల 3న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అప్పటివరకూ ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.
వ్యవసాయ చట్టాల అంశంలో తమకు ఉన్న సమస్యలపై ముసాయిదాను బుధవారంసమర్పిస్తామని రైతు సంఘాలు తెలిపాయి. తర్వాతి సమావేశం జరిగేవరకు తాము లేవనెత్తిన సమస్యలపై ఆలోచించడానికి ప్రభుత్వానికి సమయం ఉందని స్పష్టం చేశాయి.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. గురువారం జరిగే భేటీలో రైతుల చట్టాలకు సంబంధించిన సమస్యలన్నింటిపైనా చర్చిస్తామని పేర్కొన్నారు.
సరిహద్దులు మూసివేత..
కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమైనందున దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడో రోజూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ వారు పట్టుదలగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనల కారణంగా దిల్లీకి వెళ్లే పలు మార్గాల్లో వాహన రాకపోకలకు వీల్లేకుండా పోయింది. దిల్లీ-నోయిడా సరిహద్దుల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బయటి రాష్ట్రాల నుంచి రైతులు రాకుండా ఇప్పటికే సింఘూ, టిక్రీ సహా మూడు మార్గాలను మూసివేసిన పోలీసులు తాజాగా గుడ్‌గావ్, ఝజ్జర్-బహదూర్‌గఢ్ మార్గాలను కూడా మూసివేశారు. ఈ కారణంగా దిల్లీలో పలుచోట్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.