అసంపూర్తిగానే ముగిసిన చర్చలు..
నూతన వ్యవసాయ చట్టాల అంశంలో.. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన 9వ విడత చర్చలూ అసంపూర్తిగానే ముగిశాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడలేదు. సాగు చట్టాల రద్దుకే రైతు సంఘాలు కట్టుబడి ఉండడం, కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్చల్లో ఎలాంటి పరిష్కారం రాలేదు. ఈనెల 19న మరోసారి సమావేశం కావాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.
చర్చలు ప్రారంభమైన మొదట్లోనే పట్టువిడుపులతో ఉండాలని రైతు సంఘాలకు వ్యవసాయ మంత్రి తోమర్ విజ్ఞప్తి చేశారు. పలు డిమాండ్‌లకు అంగీకరించినా ప్రభుత్వం మొండిగా ఉందని, అహం ప్రదర్శిస్తోందని అనడం సరికాదని అన్నారు. అయితే మంత్రి విజ్ఞప్తి ఫలించలేదు. రైతులు తమ డిమాండ్‌లపై వెనక్కి తగ్గకపోవడంతో 5గంటల పాటు చర్చలు జరిగినా ఎలాంటి పరిష్కారం లభించకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది.