నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రైతులు రైల్‌రోకో చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రైల్‌రోకో.. సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. రైతుల ఆందోళన నేపథ్యంలో ఉత్తర భారతంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తున్నారు.
ప్రయాణికులకు ఆహారం..
రైల్‌రోకో నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు పట్టాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్, లూథియానా, ఫతేనగర్ సాహిబ్, హరియాలోని పలు ప్రాంతాలు, జమ్ము, బిహార్‌లోని పట్నా, కర్ణాటక రాజధాని బెంగళూరులో రైతులు పట్టాలపై బైఠాయించారు.
ఆందోళనను శాంతియుతంగా చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. నిలిచిపోయిన రైళ్లలో ప్రయాణికులకు ఆహారం, నీళ్లు, పండ్లు అందిస్తామని తెలిపారు. వారికి నూతన రైతుల చట్టాల వల్ల సమస్యల గురించి వివరిస్తామని తెలిపారు.