Farmers protest end: దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ హామీ అనంతరం.. నిరసనలకు ముగింపు పలికినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు.. దిల్లీ- హరియాణా సరిహద్దుల్లో తమ ఆందోళనల కోసం ఏర్పరుచుకున్న టెంట్లు, తాత్కాలిక శిబిరాలను తీసివేస్తున్నారు.
టెంట్లు తొలగిస్తున్న రైతులు కేంద్రం నుంచి లేఖ..
నిరసనలు చేస్తున్న రైతులకు కేంద్రం నుంచి ఓ లేఖ అందింది. కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు సహా రైతులపై కేసులను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ఆ లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల సందర్భంగా.. మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్నీ లేఖలో ప్రస్తావించింది కేంద్రం.
Samyukt Kisan Morcha: ఈ నేపథ్యంలోనే.. సంయుక్త కిసాన్ మోర్చా సమావేశమై.. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకుంది.
హామీలు నెరవేర్చకుంటే..
తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు స్పష్టం చేసిన రైతు సంఘం నేత గుర్నాం సింగ్.. జనవరి 15న సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే తమ నిరసనలు మళ్లీ కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
- డిసెంబర్ 11న విజయ యాత్ర చేసుకుంటూ.. రైతులు ఇళ్లకు వెళ్తారని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించారు.
- ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం అని, తమ నిరసనల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు క్షమాపణలు చెప్పారు రైతు నాయకుడు శివ్ కుమార్ కక్కా.
ఏడాదికిపైగా నిరసనలు..
Farmer Protest in India: తమ డిమాండ్లను నెరవేర్చాలని రైతులు.. దిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా ఆందోళనలు చేస్తున్నారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం ఇటీవల ఆ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా ఇతర డిమాండ్లు నెరవేర్చాలని చెబుతూ నిరసనలు కొనసాగిస్తూ వచ్చారు. వీటిపైనా సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరింది.
ఇవీ చూడండి:
Farmers Movement: రైతుల ఉద్యమంలో కీలక నాయకులు వీరే..
ఫలించిన అన్నదాతల పోరాటం.. సాగు చట్టాలు రద్దు
Farm Laws: సాగు చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం