దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది. దీంతో పాటు రైతుల సమస్యలపై దాఖలైన పిటిషన్లను సైతం విచారించనుంది.
దిల్లీ పోలీసు విభాగం ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయించింది కేంద్రం. గణతంత్ర వేడుకలకు విఘాతం కలిగించేందుకు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు ట్రాక్టర్ల కవాతును నిర్వహించాలని కొన్ని వర్గాలు భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ చర్య యావద్దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుందని వివరించింది. ఏటా గణతంత్ర దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం రాజ్యాంగపరమైన, చారిత్రకపరమైన ఆవశ్యకతను కలిగి ఉందని తెలిపింది.