తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదో రోజుకు అన్నదాతల ఆందోళన - నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన ఎందుకు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతులు చేస్తున్న ఆందోళన ఐదో రోజుకు చేరింది. దిల్లీ లోపలికి వెళ్లేందుకు అధికారులు అనుమతించని కారణంగా సరిహద్దుల్లోనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు రైతులు. దాదాపు 30 రైతు సంఘాలు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నాయి.

Farmers' protest enters fifth day
అన్నదాతల ఆందోళన ఐదో రోజుకు

By

Published : Nov 30, 2020, 11:37 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన ఐదో రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా వేలాది మంది రైతులు దిల్లీ శివారుల్లోని సంఘి, టిక్రీ రహదారుల్లోనే బైఠాయించారు. దీనితో ఈ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

దిల్లీ సరిహద్దుల్లో ఉండకుండా శివారులోని బురాడిలో ఉన్న మైదానానికి వెళ్లి ఆందోళన కొనసాగిస్తే చర్చలు జరుపుతామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనను అభ్యర్థులు తిరస్కరించిన విషయం తెలిసిందే. షరతులుంటే తాము చర్చలకు రాబోమని రైతులు స్పష్టం చేశారు. సరిహద్దుల నుంచే ఆందోళన కొనసాగిస్తామన్నారు. అవసరమైతే దిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

కేంద్రం తక్షణమే చర్చలు జరపాలి: కేజ్రీవాల్‌

రైతుల ఆందోళన తీవ్రమవుతున్న నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వం అన్నదాతలతో ఎలాంటి షరతులు విధించకుండా తక్షణమే భేటీ అవ్వాలి’ అని కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు.

దిల్లీ యూపీ సరిహద్దుల్లో భద్రత

మరోవైపు ఘాజీపూర్‌-ఘజియాబాద్‌ సరిహద్దులోనూ వేలాది మంది రైతులు ఆందోళన సాగిస్తున్నారు. దీనితో అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రాజధానిలోకి రైతులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ బారికేడ్లను తొలగించేందుకు రైతులు యత్నించడం వల్ల ఆదివారం రాత్రి స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

షరతులకు రైతులు అంగీకరించకపోవడం కారణంగా భాజపా అగ్రనేతలు ఆదివారం అర్ధరాత్రి సమయంలో భేటీ అయ్యారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు.

ఇదీ చూడండి:వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ధర్మాగ్రహం

ABOUT THE AUTHOR

...view details