నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల(Farmers protest) విషయంలో రాజ్యసభ సభ్యుడు(భాజపా) రాంచందర్ జాంగ్రా(Ramchander jangra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వారిని ఆయన పనీపాట లేని మందుబాబులుగా అభివర్ణించారు. దీంతో శుక్రవారం హరియాణా హిస్సార్ జిల్లాలోని నార్‌నౌంద్‌లో ధర్మశాల ప్రారంభించేందుకు వచ్చిన ఆయనకు(Ramchander jangra).. రైతుల నిరసన సెగ తగిలింది. భారీ ఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్న వారు నల్ల జెండాలు పట్టుకుని, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన తోపులాటలో.. ఎంపీ కారు ధ్వంసమైంది. అంతకుముందు రైతులను(Farmers protest) నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా.. అదుపు చేయలేకపోయారు. ఎంపీ తరఫున ఆయన మద్దతుదారులూ నినాదాలు చేయడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
'రైతులతో కఠినంగా వ్యవహరించండి'
రోహ్‌తక్‌లో గురువారం దీపావళి వేడుకలకు హాజరైనప్పుడు కూడా జాంగ్రాకు(Ramchander jangra) ఇదే విధమైన అనుభవం ఎదురైంది. దీంతో కార్యక్రమం అనంతరం ఆయన రైతులపై విరుచుకుపడ్డారు. నిరసనలు చేస్తున్న వారిలో రైతులెవరూ లేరని.. వారంతా పనీపాటలేని మందుబాబులని వ్యాఖ్యానించారు.