కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు(Farmers Protest) బుధవారంతో 300 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని లక్షలాది మంది రైతుల సంకల్పానికి ఈ ఉద్యమం(Farmers Protest) సాక్ష్యంగా నిలిచిందని పేర్కొంది. రానున్న రోజుల్లో ఇది మరింత బలోపేతం అవుతుందని చెప్పింది.
"దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేపట్టి మూడు వందల రోజులు పూర్తయ్యాయి. దేశ వ్యవసాయ రంగాన్ని హస్తగతం చేసుకోవడానికి చూస్తున్న కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా.. రైతులు శాంతియుతంగా పోరాడుతున్నారు. వారి డిమాండ్లు ఏంటో మోదీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న రైతులు వేసిన ఓట్ల ద్వారా గెలిచిన ప్రభుత్వం.. వాటిని అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తోంది."
- సంయుక్త కిసాన్ మోర్చా.