'బంద్ కొనసాగుతుంది..'
- శాంతియుతంగా ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాల స్పష్టీకరణ
- డిసెంబర్ 8న భారత్ బంద్ కొనసాగుతుందన్న రైతు సంఘాలు
19:30 December 05
'బంద్ కొనసాగుతుంది..'
19:29 December 05
కేంద్రం అభినందన..
''శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను కేంద్రం అభినందించింది. రాజకీయాలకు అతీతంగా రైతులు నిరసన కార్యక్రమాలు చేయడంపై కేంద్రం అభినందించింది.. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తామని కేంద్రం చెప్పింది. 9వ తేదీన కేంద్రం ఎలాంటి ప్రతిపాదనతో వస్తుందో చూడాలి. మా డిమాండ్ల పరిష్కార మార్గంలో కొంత పురోగతి ఉందని అనిపించింది. అందుకే 9వ తేదీ చర్చలకు అంగీకరించాం.''
--కవిత, అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి సభ్యురాలు
19:02 December 05
కొలిక్కిరాని చర్చలు- డిమాండ్లకు ఒప్పుకోకుంటే అంతే!
18:42 December 05
మరోదఫా చర్చలు..
దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో రైతులతో కేంద్రం చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. సాగు చట్టాలను ఉపసంహరించుకునే వరకు వెనక్కితగ్గేది లేదని రైతు సంఘాల ప్రతినిధులు పట్టుబట్టారు. సవరణలకూ ఒప్పుకోలేదు. తమ డిమాండ్లపై కేంద్రం స్పందనేంటి అని మాత్రమే ప్రశ్నిస్తున్నారు.
ఏం చేయాలో పాలుపోని కేంద్రం.. డిసెంబర్ 9న మరో దఫా చర్చలు జరుపుతామని రైతు సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
'మీరు వెళ్లిపోండి..'
దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు తోమర్ విజ్ఞప్తిచేశారు. ధర్నా ప్రాంతాల నుంచి చిన్నారులు, వృద్ధులను ఇళ్లకు పంపాలని కోరారు.
18:17 December 05
ఉపసంహరించుకోకుంటే దిల్లీ దిగ్బంధమే..
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్న రైతులతో కేంద్ర మంత్రుల భేటీ దాదాపు 4 గంటలుగా కొనసాగుతోంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ ప్రభుత్వ ప్రతిపాదనలను రైతు సంఘాల ప్రతినిధులకు వివరిస్తున్నారు. మద్దతు ధర హామీ, కొత్త చట్టాల సవరణకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసినట్టు సమాచారం. అయితే, ఐదో దఫా చర్చల సందర్భంగా చట్టాల్లో సవరణలకు ససేమిరా అంటోన్న రైతు నేతలు.. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఎంఎస్‌పీ హామీతో మరో కొత్త చట్టం తీసుకురావాలని, కొత్త చట్టం ముసాయిదా తయారీకి రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు కమిషన్‌లో సభ్యులుగా రైతులకే స్థానం కల్పించాలని కోరారు. ఇందులో నిపుణులు, ఉన్నతాధికారులను చేర్చవద్దని కేంద్రానికి ప్రతిపాదించారు. రైతు కమిషన్ రూపొందించిన ముసాయిదాను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి చట్టం చేయాలని రైతులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
కొత్త వ్యవసాయ చట్టాల్లో ఎనిమిది అంశాలకు సంబంధించి సవరణలకు వీలున్నట్టు కేంద్ర మంత్రులు రైతు ప్రతినిధులకు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రతిపాదనలకు రైతులు ససేమిరా అనడంతో పాటు ఒకానొక దశలో చర్చల్ని సైతం బహిష్కరించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అయితే, మంత్రులు వారిని సముదాయించి చర్చలు కొనసాగించాలని సూచించారు. మరో గంట పాటు ఈ భేటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం దిగి రాకపోతే ఇవే చివరి చర్చలని, మొండి వైఖరితో ఉంటే చర్చలు కొనసాగించేది లేదని రైతు నేతలు కేంద్రానికి తేల్చి చెప్పారు. తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే మరోసారి చర్చల్లో పాల్గొనబోమని, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు దిల్లీని దిగ్బంధిస్తామని తెలిపారు.
18:14 December 05
16:57 December 05
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో పదో రోజు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. రహదారులపైనే సభలు ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడే వంటా వార్పు కొనసాగించారు. దిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని టిక్రీ వద్ద రైతులు భారీ సంఖ్యలో మోహరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము సుదీర్ఘ పోరాటం చేయనున్నందున దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలే ఇక తమకు ఇల్లు లాంటివి అని రైతులు స్పష్టం చేశారు.
కరోనా వైరస్ అయినా, వణికించే చలి అయినా తమ పోరాటాన్ని ఆపబోదని వెల్లడించారు. తమకు ఆరు నెలలకు సరిపడా సరుకులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల వద్ద కూడా రైతులు పెద్ద ఎత్తున బైఠాయించడంతో పోలీసులు 44వ జాతీయ రహదారి సహా అనేక రోడ్లను మూసివేశారు. ఆందోళనల కారణంగా దిల్లీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. హరియాణా, యూపీ వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
16:55 December 05
వెనక్కి తగ్గాల్సిందే..
16:27 December 05
మద్దతు కోసం శిరోమణి అకాలీదళ్ ప్రయత్నాలు..
16:20 December 05
మేం అర్థం చేసుకోగలం..
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న రైతుల మనోభావాలను తాము అర్ధం చేసుకోగలమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైతు సంఘాల ప్రతినిధులతో దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో అయిదో విడత చర్చలు జరిపిన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార శాఖ మంత్రి పీయుష్ గోయల్.. సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరపడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. చర్చల్లో మొదట మాట్లాడిన తోమర్.. రైతుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు, రైతు సంఘాల మధ్య ఇప్పటికే నాలుగు విడతలుగా చర్చలు జరగగా ఎలాంటి పురోగతి రాలేదు. ఇవే చివరి విడత చర్చలు అని స్పష్టం చేసిన రైతు సంఘాలు.. వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్రం తమ మొండి వైఖరి వీడకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
16:17 December 05
మళ్లీ వారి భోజనమే..
కేంద్రంతో చర్చల్లో భోజన విరామం సందర్భంగా.. మరోసారి రైతులు వారే బయటినుంచి భోజనం తెప్పించుకున్నారు.
16:02 December 05
రైతుల నిర్బంధం..
15:36 December 05
రైతు సంఘాల పట్టు..
కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల సందర్భంగా తమకు పరిష్కారం కావాలని రైతులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా చర్చలు జరపాల్సింది ఏం లేదని, తమ డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకుందో చెప్పాలని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు.
15:24 December 05
'మీ భోజనం మాకొద్దు'
కేంద్రంతో నాలుగో దశ చర్చల భోజన విరామ సమయంలో.. రైతులు ప్రభుత్వ భోజనాన్ని తినేందుకు నిరాకరించారు. ఇవాళ ఐదో దఫా చర్చల్లోనూ రైతు సంఘాల ప్రతినిధులు తమ భోజనం బయటినుంచే తెప్పించుకున్నారు.
14:46 December 05
రైతు సంఘాలతో కేంద్రం ఐదో దఫా చర్చలు..
14:24 December 05
చర్చ ప్రారంభం..
సాగు చట్టాలపై రైతులతో కేంద్రమంత్రుల భేటీ మొదలైంది. రైతులతో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చిస్తున్నారు. ఈసారైనా చర్చలు ఫలిస్తాయా లేదో చూడాలి.
14:06 December 05
చేరుకున్న మంత్రి..
రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్.. విజ్ఞాన్ భవన్ చేరుకున్నారు.
13:32 December 05
12:51 December 05
చర్చలకు బయలుదేరిన నాయకులు
కేంద్రంతో ఐదో దఫా చర్చలకు రైతు సంఘాల నాయకులు బయలుదేరారు. దిల్లీ సింఘూ సరిహద్దు నుంచి బస్సులో నేరుగా విజ్ఞాన్ భవన్‌కు వెళ్లారు.
12:39 December 05
బిహార్‌లో ఆందోళన
బిహార్ పాట్నలో జేడీయూ నేత తేజస్వీయాదవ్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తేజస్వీ డిమాండ్ చేశారు.
12:27 December 05
ముగిసిన భేటీ
హోంమంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో ప్రధాని భేటీ ముగిసింది. సమావేశంలో రైతులతో మాట్లాడే విషయాలపై మోదీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం.
10:52 December 05
ఆందోళనలో వినోదం..
దిల్లీ- హరియాణా సరిహద్దులో రైతులు ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. అయితే ఎన్నో రోజుల నుంచి అక్కడే ఉన్న రైతులు కాస్త వినోదం కోసం నిన్న రాత్రి ఓ ట్రాక్టర్‌కు డీజే పెట్టించారు. పంజాబీ పాటలు వస్తుంటే నృత్యం చేస్తూ ఆందోళనలో పాల్గొన్నారు.
10:27 December 05
కీలక భేటీ..
రైతులు-కేంద్రం మధ్య ఈ రోజు మధ్యాహ్నం సాగు చట్టాలపై కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. రైతులతో సమావేశంలో మాట్లాడే అంశాలపై మోదీ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.
09:58 December 05
మధ్యాహ్నం భేటీ..
కేంద్రంతో రైతుల సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్నట్లు కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చర్చల తర్వాత రైతులు ఆందోళనను విరమిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
08:36 December 05
పార్లమెంట్ ముట్టడిస్తాం..
వ్యవసాయ చట్టాలకు వ్యవతిరేకంగా చేస్తోన్న ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. చిల్లా సరిహద్దు (దిల్లీ-నోయిడా లింక్ రోడ్డు), టిక్రీలోని దిల్లీ-హరియాణా సరిహద్దుల్లో రోడ్డపై బైఠాయించారు. ఈరోజు కేంద్రం-రైతుల మధ్య జరిగే చర్చల్లో పరిష్కారం లభించకపోతే.. పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు రైతు సంఘాల నేతలు.
ఈ క్రమంలో ఘాజీపుర్ సరిహద్దు (యూపీ-దిల్లీ సరిహద్దు)లో ఎన్‌హెచ్-24 రహదారిని మూసివేశారు దిల్లీ పోలీసులు. అలాగే.. ఝటికారా సరిహద్దు(దిల్లీ-హరియాణా సరిహద్దు)లో కేవలం ద్విచక్రవాహనాలనే అనుమతిస్తున్నారు. హరియాణా వెళ్లేందుకు ధాన్షా, దౌరాలా, కపషేర, రాజోక్రి ఎన్‌హెచ్-8, బిజ్వాసన్, పలామ్ విహార్, దుందహేరా సరిహద్దుల గుండా వెళ్లాలని సూచించారు. నోయిడా లింక్ రోడ్డులోని చిల్లా సరిహద్దులనూ మూసివేశారు.
07:32 December 05
రైతులతో మరోసారి కేంద్రం చర్చలు- ఈసారైనా ఫలించేనా?
నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. కేంద్రం ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. సాగు చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించారు. చట్టాలు రైతు వ్యతిరేకమని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని గత సమావేశాల్లో డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని కోరారు.
ఇవాళ జరిగే సమావేశంలోనైనా ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని అన్నదాతలు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 8న భారత్ బంద్ నిర్వహించాలని రైతునాయకులు నిర్ణయించారు. ఆ రోజు దిల్లీని ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి రాకపోకలను నిలిపివేస్తామని హెచ్చరించారు. శనివారం ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. ఇవాళ రైతులకు మద్దతుగా పంజాబ్, హరియాణాకు చెందిన పలువురు క్రీడాకారులు పతకాలను వాపాసు చేస్తామని తెలిపారు.