గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఎర్రకోటపై జెండా ఎగరవేసింది భాజపా కార్యకర్తలేనని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కొత్తసాగు చట్టాల పేరుతో కేంద్రం రైతుల పాలిట మరణ శాసనాలు రాస్తోందన్నారు. సాగు చట్టాలు అమలులోకి వస్తే రైతులు వారి సొంత పొలాల్లోనే కూలీలుగా పనిచేయాల్సి వస్తుందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరట్‌లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"కేంద్రం కొత్తసాగు చట్టాల పేరుతో రైతుల పాలిట మరణ శాసనాలను రాస్తోంది. వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే కర్షకులు వారి సొంత పొలాల్లోనే కూలీలుగా మారతారు. జనవరి 26 నాటి ఎర్రకోట ఘటన భాజపా నాయకుల పథకం ప్రకారమే జరిగింది. అనుకున్న విధంగానే ఆందోళనకారులను కమల దళం ఎర్రకోట వైపు పంపారు. అక్కడ జెండా ఎగరవేసింది కూడా భాజపా కార్యకర్తలే. రైతులెప్పుడూ జాతి వ్యతిరేక పనులు చేయరు. అన్నదాతలను కేంద్రం ఉగ్రవాదులతో పోలుస్తోంది, అది అమానుషం. దేశాన్ని పాలించిన బ్రిటీష్ వారు రైతులను అవమానపరచలేదు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది."