రైతులు చేపట్టిన నిరసనలను ప్రస్తుతానికి కొనసాగించవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఆస్తి, ప్రాణనష్టం జరగనంత వరకు నిరసనలు రాజ్యాంగబద్ధమేనని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. హింసాత్మక ఘటనలకు పాల్పడడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయితే.. కేంద్రం, రైతులు చర్చలు జరపాలని, ఇరు పక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు పేర్కొంది. దేశరాజధాని చుట్టుపక్కల నిరసన చేస్తున్న రైతులను తరలించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
''మేం కూడా భారతీయులమే. రైతుల దుస్థితి మాకు తెలుసు. వారికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. కానీ.. నిరసన చేసే విధానమే మారాలి. మేం మీ కేసును పరిశీలిస్తామని స్పష్టం చేస్తున్నాం. అందుకే.. మేం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.'' అని అన్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే.
అన్ని రైతు సంఘాల వాదనల తర్వాతే కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దిల్లీని దిగ్బంధిస్తే నగరంలో ఆకలికేకలు పెరుగుతాయని పిటిషనర్ ఆరోపించినట్లు తెలిపింది సుప్రీం కోర్టు. కూర్చొని నిరసనలు చేస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన జస్టిస్ బోబ్డే.. చర్చలే సమస్యకు పరిష్కారం అని నొక్కిచెప్పారు.