తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​ బంద్'పై​ రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు - దిల్లీ సరిహద్దులో రైతులు నిరసన

Farmers continue to camp at Singhu borde
12వ రోజుకు రైతులు ఆందోళనలు

By

Published : Dec 7, 2020, 7:50 AM IST

Updated : Dec 7, 2020, 3:34 PM IST

15:30 December 07

కేంద్రం మార్గదర్శకాలు...

భారత్​ బంద్​ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిభద్రలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. కరోనా నేపథ్యంలో కొవిడ్​ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని దేశవ్యాప్తంగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.

14:30 December 07

దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ చట్టాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొత్త చట్టాలను తక్షణమే రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేయగా... భాజపా ఎదురుదాడికి దిగింది.

అవి 'అంబానీ-అదానీ' చట్టాలు

కొత్త వ్యవసాయ చట్టాల్ని 'అంబానీ-అదానీ చట్టాలు'గా అభివర్ణించారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకు మించి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

రద్దు చేస్తారా? గద్దె దిగుతారా?

కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజావ్యతిరేకమని విమర్శించారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. తక్షణమే ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవాలని లేదా గద్దె దిగాలని డిమాండ్ చేశారు.

గతం మరిచారా?

విపక్షాలపై భాజపా ఎదురుదాడికి దిగింది. గతంలో తాము ఏం చేశామో మర్చిపోయి... రాజకీయ ఉనికి కోసమే కేంద్రం చర్యల్ని ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడింది. ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంపై ఆంక్షలు ఎత్తేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.  

13:37 December 07

డిసెంబర్​8న రైతులు తలపెట్టిన భారత్​ బంద్​కు తమ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​. తమ పార్టీ కార్యకర్తలు బంద్​లో పాల్గొంటారని చెప్పారు. తమిళనాడులో ఆందోళనలు చేస్తున్న రైతులను పళనిస్వామి ప్రభుత్వం అరెస్టు చేస్తోందని ఆరోపించారు.

12:54 December 07

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన రైతులకు మద్దతుగా సమాజ్​వాదీ పార్టీ నేత అఖిలేశ్​ యాదవ్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. లఖ్​నవూలోని తన నివాసం నుంచి కన్నౌజ్​కు ర్యాలీగా​ వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే కార్యకర్తలతో బైఠాయించిన ఆయన.. అవసరమైతే తనను అరెస్టు చేయాలన్నారు. తమ వాహనాలను పోలీసులు ఆపారాని, కాళి నడకనే కన్నౌజ్​కు వెళ్తామని చెప్పారు.

11:57 December 07

పార్లమెంటు శీతాకాల ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్​ చేస్తున్నారు పంజాబ్​ కాంగ్రెస్​ ఎంపీలు. దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద నిరసనకు దిగారు. రైతు వ్యతిరేకమైన వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాలు నిర్వహించకూడదని కేంద్రం భావిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు.

11:49 December 07

దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలకు తృణమూల్ కాంగ్రెస్ పూర్తి మద్దతుగా ఉంటుందని చెప్పారు ఆ పార్టీ ఎంపీ సౌగతా రాయ్​. అయితే బంగాల్​లో మాత్రం భారత్​ బంద్​కు తాము మద్దతు తెలుపబోమమన్నారు. బంద్ తమ పార్టీ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.

10:49 December 07

సింఘు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​. రైతులు చేస్తున్న డిమాండ్లు సమ్మతమేనని చెప్పారు. డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్​ బంద్​కు ఆమ్​ఆద్మీపార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. బంద్​ విజయవంతం చేయాలని ఆప్​ కార్యకర్తలకు సూచించారు. రైతులకు తాము మొదటి నుంచి మద్దతుగానే ఉన్నట్లు తెలిపారు. దిల్లీలోని 9 స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలని కేంద్రం ఒత్తిడి చేసినప్పటికీ తాను ఒప్పుకోలేదని గుర్తు చేశారు.

10:36 December 07

సింఘు సరిహద్దులోని గురు తేగ్ బహదూర్​ స్మారకం వద్దకు చేరుకున్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​. అక్కడ ఆందోళనలు చేస్తున్న రైతలను కలిశారు. వారి కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

10:20 December 07

దిల్లీ-హరియాణా సరిహద్దు టిక్రి వద్ద 12వ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నారు. రేపు భారత్​ బంద్​కు పిలుపునిచ్చారు. బుధవారం రోజు కేంద్రంతో 6వ దఫా చర్చల్లో పాల్గొననున్నారు.

10:14 December 07

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన రైతుల వద్దకు వెళ్తున్నారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​. సింఘూ సరిహద్దులో రైతుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

08:06 December 07

భారత్​ బంద్​కు బీఎస్పీ మద్దతు

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ డిసెంబర్​ 8న తలపెట్టిన భారత్​ బంద్​కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు విపక్ష, ప్రాంతీయ పార్టీలు, కార్మీక సంఘాలు, సామాజిక సంఘాలు మద్దతు తెలిపగా.. తాజాగా బహుజన సమాజ్​ పార్టీ ఆ జాబితాలో చేరింది. భారత్​ బంద్​కు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు ట్వీట్​ చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. 

07:31 December 07

కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల ఆందోళనలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేసేవరకు వెనుదిరిగేది లేదని తెల్చిచెబుతున్నారు. సింఘు సరిహద్దు (హరియాణా-దిల్లా సరిహద్దు)లో రాత్రిళ్లు సైతం రోడ్లపైనే ఉంటూ ధర్నాను కొనసాగిస్తున్నారు రైతులు.

కేంద్రంతో ఐదుదఫాలుగా జరిగిన చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాకపోవటం వల్ల డిసెంబర్​ 8న దేశవ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ క్రమంలో వారికి దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, కార్మిక సంఘాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. రేపటి భారత్​ బంద్​లో తామూ పాల్గొని రైతులకు మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించారు.  

Last Updated : Dec 7, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details