హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో.. 109మంది పోలీస్ సిబ్బంది గాయపడినట్లు దిల్లీ పోలీస్ అధికారి ఈష్ సింఘాల్ వెల్లడించారు. నిర్ణీత సమయం కంటే ముందే ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారని వివరించారు. రైతులు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి హింస, విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వివరించారు.
30మందికి సీరియస్..
మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో పనిచేసే 30 మంది పోలీస్ సిబ్బంది.. ఘర్షణల్లో తీవ్రంగా గాయపడినట్లు దిల్లీ పోలీస్ అధికారులు తెలిపారు. ద్వారకాలో జరిగిన ఈ ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వివరించారు.
కేసులు నమోదు..
ర్యాలీలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. తూర్పు దిల్లీలో 8 బస్సులు, 17 ప్రైవేటు వాహనాలను రైతులు ధ్వంసం చేశారని వివరించారు. ఇప్పటివరకు 4 కేసులు నమోదు చేశామన్నారు.
దిల్లీ ఘటనపై సీజేఐకు లేఖ
రైతుల ట్రాక్టర్ ర్యాలీలు, 6 హింసాత్మక ఘటనలపై సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డేకు లేఖ రాశారు న్యాయ విద్యార్థి ఆశిష్‌రాయ్. ఎర్రకోటపై వేరే జెండా ఎగురవేయటాన్ని సుమోటోగా తీసుకోవాలన్నారు. రైతుల ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆస్తికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని సీజేఐను కోరారు.
ఇదీ చదవండి :'దిల్లీలో హింస బాధాకరం.. కేంద్రానిదే తప్పు'
దద్దరిల్లిన దిల్లీ- ఎర్రకోటపై 'రైతు' జెండా