తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంగళవారం 'భారత్​ బంద్​'- అన్ని వర్గాల మద్దతు!

మంగళవారం జరగనున్న భారత్​ బంద్​కు రైతు సంఘాలు సర్వ సన్నద్ధమయ్యాయి. సాగు చట్టాలపై వ్యతిరేకతను, తమ ఐక్యతను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు కర్షకులు. అయితే బంద్​ శాంతియుతంగానే ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు భారత్​ బంద్​కు విపక్షాల నుంచి మద్దతు లభించింది. కేంద్రం దిగొచ్చి రైతుల డిమాండ్లను అంగీకరించాలని ఆయా పార్టీలు తేల్చిచెప్పాయి. రైతులకు టీఎంసీ సంఘీభావం ప్రకటించినప్పటికీ.. బంగాల్​లో మాత్రం భారత్​ బంద్​కు మద్దతివ్వడం లేదని వెల్లడించింది.

Opposition parties except TMC extend support to Dec 8 'Bharat Bandh' call by farmers' unions
రేపే రైతన్న ' భారత్​ బంద్​'- అన్ని వర్గాల మద్దతు

By

Published : Dec 7, 2020, 5:18 PM IST

Updated : Dec 7, 2020, 6:00 PM IST

నూతన వ్యవసాయ చట్టాలపై దిల్లీలో రైతులు చేపట్టిన నిరసన సెగ మంగళవారం యావత్​ దేశాన్ని తాకనుంది. 'భారత్​ బంద్​'కు పిలుపునిచ్చిన రైతన్నలు.. తమ ఐక్యతను, చట్టాలపై వ్యతిరేకతను చాటిచెప్పేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలకు వివిధ పార్టీలు సంఘీభావంగా నిలిచి భారత్​ బంద్​కు మద్దతు ప్రకటించాయి.

'శాంతియుతంగానే ఆందోళనలు'

ఇప్పటివరకు తమ ఆందోళనలు శాంతియుతంగానే సాగాయని.. ఇకపైనా అదే విధంగా ఉంటాయని భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రతినిధి రాకేశ్​ టికైట్​ వెల్లడించారు. చట్టాలపై తమ వ్యతిరేకతను చాటేందుకు ఇది మంచి అవకాశమన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని విధానాలకు తాము మద్దతివ్వమని చెప్పేందుకు భారత్​ బంద్​ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

'రాజకీయాలకు తావు లేదు'

తమ ఆందోళనల్లో రాజకీయాలకు తావు లేదని.. రాజకీయ నేతలకు తమ వేదికలపై అనుమతి లేదని స్పష్టం చేశారు రైతు సంఘాల నేత డా. దర్శన్​ పాల్​. మంగళవారం మొత్తం బంద్​ పాటిస్తామని.. అయితే రోడ్డు దిగ్బంధం వంటి నిరసనలు మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకే జరుగుతాయని వెల్లడించారు. భారత్​ బంద్​ను శాంతియుతంగానే చేపట్టాలని తాము నిశ్చయించుకున్నట్టు స్పష్టం చేశారు.

కేంద్రం మార్గదర్శకాలు...

భారత్​ బంద్​ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. కరోనా నిబంధనలను కూడా కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

విపక్షాల మద్దతు...

రైతుల 'భారత్​ బంద్​'కు 20 రాజకీయ పార్టీలు, 35 విద్యార్థి సంఘాలు, 5 కార్మిక సంఘాలు, 50 ట్రాన్స్ ఫోర్ట్ సంఘాల మద్దతు పలికాయి. తృణమూల్​ కాంగ్రెస్​ మినహా విపక్షాలు మద్దతు ప్రకటించాయి. రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్​ వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో తమ పార్టీ శ్రేణులు నిరసనలు తెలుపుతారని స్పష్టం చేసింది. భారత్​ బంద్​ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే అది భాజపా తప్పేనని పేర్కొంది.

  • భారత్​ బంద్​కు మద్దతు ప్రకటించింది డీఎం​కే. తమిళనాడు ప్రభుత్వం రైతుల పోరాటాన్ని అడ్డుకుంటోందని మండిపడింది.
  • కేంద్ర ప్రభుత్వం తన మొండివైఖరిని మానుకుని సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని సీపీఐ డిమాండ్​ చేసింది.
  • రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఇకనైనా వారికి న్యాయం చేయాలని తేల్చిచెప్పింది బీఎస్​పీ. అన్నదాతల ఆందోళనకు తమ మద్దతుంటుందని స్పష్టం చేసింది.
  • తెరాస​, ఆప్​, ఎస్​పీ, ఆర్​జేడీ, శివసేన, ఎన్​సీపీ కూడా భారత్​ బంద్​కు మద్దతు ప్రకటించాయి.
  • అన్నదాతలకు సంఘీభావం తెలిపింది తృణమూల్​ కాంగ్రెస్​. అయితే బంగాల్​లో మాత్రం భారత్​ బంద్​కు మద్దతివ్వడం లేదని పేర్కొంది.

ఇదీ చూడండి:-సాగు చట్టాలపై విపక్షాలు గరం​- భాజపా ఫైర్​

'మార్కెట్లు తెరిచే ఉంటాయి..'

రైతులు ప్రకటించిన భారత్​ బంద్​కు వ్యతిరేకంగా సీఐఏటీ(కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఆల్​ ఇండియా ట్రేడర్స్​), ఏఐటీడబ్ల్యూఏ(ఆల్​ ఇండియా ట్రాన్స్​పోర్టర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​) కీలక నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం.. దిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లు తెరిచే ఉంటాయని, రవాణా సర్వీసులు కూడా నడుస్తాయని స్పష్టం చేశాయి.

రైతులకు బీఎస్​ఎన్​ఎల్​ ఉద్యోగుల సంఘీభావం తెలిపారు. రైతన్నల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకు అన్నదాతలకు తమ మద్దతుంటుందని స్పష్టం చేసింది బీఎస్​ఎన్​ఎల్​ ఉద్యోగుల యూనియన్​.

రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ పలు బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే ప్రకటన విడుదల చేశాయి. వీలైనంత త్వరగా చర్చలు జరిపి.. వారి సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించాయి.

ఇదీ చూడండి:-అఖిలేశ్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Last Updated : Dec 7, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details