కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతాయని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నారు. ప్రభుత్వం.. సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకూ తమ ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేదిలేదని హరియాణాలో జరిగిన 'మహా పంచాయత్'లో పేర్కొన్నారు. అంతేకాకుండా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అన్నదాతల ఉద్యమంలో భాగస్వాములైన ఆ హరియాణా రైతులకు, ఖాప్స్ వర్గం వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు టికాయత్. ఉద్యమంలో భాగంగా అవసరమైనప్పుడు దిల్లీకి వెళ్లేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.
'రైతులపై కేసులకు భయపడేది లేదు'
దిల్లీలో జనవరి 26న జరిగిన ఘటన అనంతరం.. అనేక మంది రైతులపై కేసులు నమోదయ్యాయని టికాయత్ అన్నారు. ఇలాంటి వాటికి తాము భయపడమన్న ఆయన.. ఎన్నాళ్లైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కేంద్రం చట్టాల్ని వెనక్కి తీసుకునేవరకూ రైతులు ఎక్కడికీ వెళ్లరని స్పష్టం చేశారు.
"వేసవి కాలంలో రైతులు వెనక్కి వెళ్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అంతకుముందు శీతాకాలంలోనూ ఇలాగే అభిప్రాయపడింది. కానీ వారి ఆలోచనల్ని తిప్పికొడుతూ.. ఎముకలు కొరికే చలిలోనూ ఉద్యమించాం. కేంద్రం దిగిరాకపోతే నవంబర్ లేదా డిసెంబర్ వరకూ ఆందోళనలు కొనసాగిస్తాం. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాం."