నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం సహిస్తోంది కదా అని.. హద్దులు మీరొద్దని హెచ్చరించారు. దానికీ ఓ రోజు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. యూపీ- దిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమకారులకు, భాజపా కార్యకర్తలకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"రైతు' అనే పదం ఎంతో స్వచ్ఛమైనది. దానికి ఉన్నత స్థానం ఉంది. దురదృష్టవశాత్తూ కొన్ని ఘటనల వల్ల ఆ పదం అపఖ్యాతి పాలౌతోంది" అని ఖట్టర్ అన్నారు. రైతు ఉద్యమం పేరుతో సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, రోడ్లను దిగ్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.