సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైందని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే తాము అన్నింటినీ మూసివేయలేదని పేర్కొన్నారు. బంద్‌కు దేశంలోని రైతులందరూ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదన్నారు.
Bharat Bandh: 'కేంద్రంతో చర్చలకు సిద్ధం'
14:55 September 27
12:40 September 27
భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులోని రజోక్రి ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దాని ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.
11:29 September 27
తమినాడులో ఉద్రిక్తత..
తమిళనాడులో రైతులకు మద్దతుగా జరుగుతున్న భారత్ బంద్‌లో ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలో పోలీసు బారికేడ్లను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. దీంతో నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీపీఎం కార్యదర్శి కె బాలకృష్ణన్ మాట్లాడుతూ.. "సాగు చట్టాలను ఉపసంహరించుకోవడానికి మోదీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. రైతు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం" అని పేర్కొన్నారు.
10:48 September 27
రైల్వే ట్రాకులుపై రైతుల బైఠాయింపు
పంజాబ్ అమృత్‌సర్‌లోని దేవిదస్పుర గ్రామంలో రైతులు.. రైల్వే ట్రాకుపై బైఠాయించి.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
దిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పుర్ డివిజన్లలో అన్నదాతలు.. రైల్వే ట్రాక్‌లపై బైఠాయించడంతో.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు.
10:16 September 27
భారీగా ట్రాఫిక్ జామ్
దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారత్ బంద్ నేపథ్యంలో రాజధానిలోకి ప్రవేశించే వాహనాలను భద్రతా బలగాలు తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్-దిల్లీ సరిహద్దులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
09:50 September 27
కర్ణాటకలోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. కలబురిగిలో బస్‌స్టాండ్ ఎదుట పలు సంస్థలు రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
09:35 September 27
ప్రశాంతంగా భారత్ బంద్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉదయం నుంచే రైతన్నలు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన అధికారుల భారీ సంఖ్యలో భద్రత దళాలను మోహరించారు.
కేరళలో వామపక్ష ప్రభుత్వం అన్నదాతలకు మద్దతుగా నిలిచింది. సంపూర్ణంగా భారత్ బంద్ పాటిస్తుంది. తిరువనంతపురంలో దుకాణాలు మూసివేశారు. దీంతో రోడ్లన్నీ ఎడారిని తలపిస్తున్నాయి.
08:45 September 27
పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతమైన షంభూ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న రైతులు.. అక్కడి జాతీయ రహదారిని దిగ్భందించారు. వాహనాలు వెళ్లేందుకు అన్నదాతలు అనుమతించటకపోవడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హరియాణా రోహ్‌తక్, కర్నాల్ ప్రాంతాల్లోనూ నిరసనకు చేపట్టిన రైతన్నలు.. రహదారిపై ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను అడ్డుకున్నారు. అటు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతన్నలు ఆందోళనకు దిగారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరక్‌పూర్‌లో భారత్ బంద్‌కు వామపక్షాలు మద్దతు తెలిపాయి. రైతుల ప్రయోజనాలను హరించే సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
బిహార్‌లోని హాజీపూర్ లో నిరసన చేపట్టిన ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
07:44 September 27
దేశవ్యాప్తంగా భారత్ బంద్
నూతన వ్యవసాయ చట్టాలకు(New Farm laws) వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్(Bharat Bandh news) ప్రశాంతంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము 4గంటల నుంచే.. రహదారులపైకి చేరిన అన్నదాతలు కేంద్రానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని విప్పారు. దిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపుర్ లోనూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొత్త సాగు చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దిల్లీలో భారీ భద్రత..
మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇండియా గేట్, విజయ్ చౌక్ సహా ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిరసన శిబిరాల నుంచి దేశ రాజధానిలోకి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు.
భారత్ బంద్‌కు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎస్పీ, బీఎస్పీ, వామపక్షాలు, తెలుగుదేశం సహా పలు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ప్రజా సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతిచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం బంద్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు బంద్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించాయి.
ఈ బంద్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
'రైతులు చర్చలకు రావాలి'
దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రైతులు ఆందోళనను వీడి.. చర్చలకు రావాలన్నారు. అన్నదాతలు లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గ్వాలియర్‌లోని వ్యవసాయ కళాశాలలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రైతులతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపిందని.. భవిష్యత్తులో కూడా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతు ఉద్యమాన్ని రాజకీయం చేయకూదని తోమర్ పేర్కొన్నారు.