తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు గుండె చప్పుడు- రాకేశ్​ టికాయిత్​!

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో ప్రధానంగా వినిపిస్తున్నపేరు రాకేశ్​ టికాయిత్​. ఆయన ఒక్క పిలుపు.. అనేక మందిని ఏకం చేస్తోంది. ట్రాక్టర్​ ర్యాలీ పరిణామాల తర్వాత ఇక ఉద్యమం ఆగిపోయిందనుకున్న దశలో టికాయిత్​​ మాటలు ఎందరినో ప్రభావితం చేశాయి. మళ్లీ పోరుకు పునరుజ్జీవం తెచ్చాయి. ఇంతకీ రైతు నాయకుడి ప్రస్థానం ఎలా మొదలైందంటే..

rakesh tikait life story
రైతు గుండె చప్పుడు- రాకేశ్​ టికాయిత్​!

By

Published : Jan 31, 2021, 10:00 AM IST

ఆ ఒక్క పిలుపు అనేక మందిని కదిలిస్తోంది. ఆయన కళ్లు చెమ్మగిల్లాయంటే కొన్ని వేల మంది గుండెలు బరువెక్కిపోతున్నాయి. మీ వెంటే మేం ఉన్నామంటూ ఆ హృదయాలన్నీ పరుగులు తీసి వస్తున్నాయి. ఆయనే రాకేశ్‌ టికాయిత్‌..! రైతుల ఉద్యమం మొత్తానికి కేంద్ర బిందువు. ఇటీవలి కాలం వరకు ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్‌కే ఆయన పరిమితం. రెండు నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంలో ఆయన పేరు ప్రముఖంగా వినవస్తోంది.

పోలీసు శాఖ.. రాజకీయం.. ఉద్యమం
పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన టికాయిత్‌ (51) స్వస్థలం యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలోని సిసౌలీ. ఆయన తండ్రి సుప్రసిద్ధ రైతునేత మహేంద్రసింగ్‌ టికాయిత్‌.. భారతీయ రైతుల యూనియన్‌కు మాజీ అధ్యక్షుడు. 1987లో ఆయన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ)ను స్థాపించి, రైతులతో ఆందోళన చేయించారు. ఆ ఏడాది జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోవడం బీకేయూ ఆవిర్భావానికి నాంది పలికింది. కన్నుమూసే వరకు మహేంద్రసింగ్‌ ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చారు.

ఆయన తనయుడు రాకేశ్‌ టికాయిత్‌ ఎల్‌ఎల్‌బీ చదువుకున్నారు. తొలుత దిల్లీలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు. తర్వాత రాజకీయాలపై ఆసక్తితో 2007లో యూపీ అసెంబ్లీకి, 2014లో లోక్‌సభకు పోటీ చేసినా రెండుసార్లూ ఓడిపోయారు. 2011లో తండ్రి మరణానంతరం బీకేయూలో కీలక బాధ్యతలు చేపట్టి, రైతు సమస్యలపై ఉద్యమిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆందోళన కార్యక్రమాల్లో 44 సార్లు కారాగారానికి వెళ్లి వచ్చారు. రుణమాఫీ, కనీస మద్దతు ధర, విద్యుత్తు రుసుములు, భూసేకరణ వంటి అంశాలపై యూపీ, హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో ఉద్యమాలు నడిపారు.


అయిపోయిందనుకున్న ఉద్యమానికి ఊపిరి
దిల్లీలో గణతంత్ర దినోత్సవాన రైతుల ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనలతో ఉద్యమం ఇక ఆగిపోయిందనుకున్న దశలో టికాయిత్‌ రంగంలో దిగి, ఒక దశలో భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పరిణామం చాలా కీలకంగా మారి, వేలమంది రైతుల్లో కదలిక తీసుకువచ్చింది. ఇప్పుడు ఉద్యమ శిబిరాల్లో పెరిగిన తాకిడికి అదే ఒకరకంగా కారణమైంది. రైతులంతా మరోసారి సంఘటితమయ్యారు. టికాయిత్‌ మాటలు విన్నాక వారిలో చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. పోరాటాన్ని ఆపేది లేదని స్వయంగా టికాయిత్‌ స్పష్టంచేశారు. దీక్షా శిబిరాలకు నీటి ట్యాంకర్లు రాకుండా స్థానిక అధికారులు అడ్డుకుంటుండడం వల్ల తాను రైతులు తెచ్చిన నీటినే తాగుతానని రెండ్రోజుల క్రితం టికాయిత్‌ ప్రకటించారు. దీంతో స్వగ్రామం నుంచి పిల్లాపాపలతో రైతులు తరలివచ్చి, ఇంట్లో చేసిన పరోటాలు ఆయనకు ఇచ్చారు. తాగడానికి నీళ్లు, మజ్జిగ కూడా మట్టికుండల్లో అక్కడి నుంచి తెచ్చారు.

ఇంటర్నెట్‌ పునరుద్ధరించండి..
సరిహద్దు శిబిరాలున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాలని టికాయిత్‌ డిమాండ్‌ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను, డిమాండ్లను తెలియజెప్పే అవకాశం ఇవ్వాలన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details