కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలం పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా కీలక సభ్యుడు, హరియాణా కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చఢూనీ.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ పేరును సంయుక్త సంఘర్ష్ పార్టీగా తెలిపారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించారు గుర్నామ్ సింగ్ చఢూనీ.
" సంయుక్త సంఘర్ష్ పార్టీని ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. రాజకీయాలను ప్రక్షాళన చేయటం సహా మంచి వారికి అవకాశం కల్పించటమే మా పార్టీ లక్ష్యం. "
- గుర్నామ్ సింగ్ చఢూనీ, రైతు నేత