Farmer Kills Tiger :తమిళనాడులోని నీలగిరి జిల్లాలో రెండు పులుల అనుమానాస్పదమృతి ఘటనలో.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు. ఎమరాల్డ్‌లోని నీటి కుంటలో మూడు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులులు మృతి చెందినట్లు గుర్తించి.. దీనిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు పులుల కళేబరాలకు సమీపంలోనే ఓ ఆవు కళేబరం లభ్యమైంది. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పులులు, ఆవు కళేబరాల నుంచి నమూనాలను సేకరించి కోయంబత్తూరుకు పంపారు అధికారులు. కళేబరాలలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు నివేదిక వచ్చింది. విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడం వల్లే పులులు చనిపోయినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది.
ఈ క్రమంలో సోమవారం ఆవు యజమాని శేఖర్‌ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. తానే ఆవు కళేబరాన్ని విషపూరితం చేసినట్టు శేఖర్ అంగీకరించాడు. పది రోజుల కిందట తప్పిపోయిన తన ఆవును వెతకడానికి సమీపంలోని అడవికి వెళ్లానని, ఓ చోట ఆవు మృతదేహం కనిపించిందని, దానిని పులి చంపినట్లు గ్రహించానని తెలిపాడు. తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీసుకోవాలని భావించి.. పురుగుమందులతో దాని మృతదేహాన్ని విషపూరితం చేసినట్టు వివరించాడు.
చనిపోయినవాటిలో ఒక పులి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించకపోగా.. మరొకటి గాయపడినట్లు అధికారులు తెలిపారు. విషపూరిత ఆవు కళేబరాన్ని తిని కనీసం రెండు పులులలో ఒకటి మరణించి ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. మరో పులి ఎలా చనిపోయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే, విషపూరిత కళేబరాన్ని తినడానికి ముందు మూడేళ్ల వయసున్న పులిని ఎనిమిదేళ్ల వయసున్న పులి చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. గాయాలున్న పులి మరణానికి కచ్చితమైన కారణాలు ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ తర్వాత వెల్లడవుతుందని అన్నారు.