తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీ సాగు - organic farming in india

భూసారం, జీవవైవిధ్యాన్ని కాపాడే సేంద్రీయ సాగుతో లుధియానాకు చెందిన హర్​దేవ్​ సింగ్​ వివిధ రకాల పంటలను పండిస్తున్నాడు. అయితే వీటన్నిటిలో ఆయన పండించే స్ట్రాబెర్రీలు ప్రత్యేకమైనవి. వీటికి పంజాబ్​ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

3mp
పంజాబ్​ స్ట్రాబెర్రీ

By

Published : Mar 15, 2021, 4:13 PM IST

సెంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీ సాగు

భూగర్భజలాల స్థాయులు క్రమంగా తగ్గిపోవడం రైతులు, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న సమస్య. భూసారాన్ని రక్షించుకోవడం, నీటి స్థాయులు పెంచుకోవడం రెండూ సమప్రాధాన్యమున్న సవాళ్లే. వరి, గోధుమ లాంటి సంప్రదాయ పంటలే కాకుండా.. విభిన్న రకాల పంటలు పండించాల్సిందిగా ప్రభుత్వం రైతులకు సూచనలు చేస్తుంటుంది. భూసారం, జీవవైవిధ్యాన్ని కాపాడే అలాంటి ఓ సాధనమే సేంద్రీయ సాగు. లుధియానాకు చెందిన నంధారీ హర్‌దేవ్ సింగ్ తన పొలంలో సేంద్రీయ విధానాల్లో స్ట్రాబెర్రీలు పండిస్తున్నాడు. ఈయన పండించే స్ట్రాబెర్రీలు పంజాబ్‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న హర్‌దేవ్.. వాటన్నింటినీ అధిగమించి, పంజాబ్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో విద్యార్థులకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగాడు.

"2011లో ఒక ఎకరం భూమిలో సేంద్రీయ సాగు ప్రారంభించాను. ప్రస్తుతం నాలుగెకరాల్లో సాగు చేస్తున్నాం. కష్టపడి పనిచేయాలి. ప్రతిదీ వాతావరణంపై ఆధారపడే ఉంటుంది. ఏదేమైనా మేం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు వాతావరణం అనుకూలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో మొక్కలు పెంచుతున్నాం. కులులో పెంచేవాళ్లం, ఇప్పుడు ఇక్కడ పెంచుతున్నాం. స్ట్రాబెర్రీ మొక్కలు గింజలు నాటితే పెరగవు. ఇప్పుడున్న పంట ఏడాదిన్నర క్రితం నాటిది."

-హర్‌దేవ్ సింగ్, రైతు

పంజాబ్‌లో ఇంకెక్కడా దొరకని ఈ ప్రత్యేక స్ట్రాబెర్రీలను ఎలా పండిస్తున్నాడో వివరిస్తున్నాడు హర్‌దేవ్ సింగ్.

"ప్రస్తుతం ఈ స్ట్రాబెర్రీలను లుధియానా, చండీగఢ్‌లకు మాత్రమే విక్రయిస్తున్నాం.సేంద్రీయ పద్ధతుల్లోనే పంట పండిస్తున్నాం. ఎరువులుగా బాక్టీరియాను వినియోగిస్తాం. దీనితో పాటు ఇంట్లో తయారుచేసిన ఎరువులనే వాడతాం. మొక్కలకు ప్రతిరోజూ పోషకాలు అందించాల్సి ఉంటుంది. డ్రిప్ విధానం లేకుండానే..మొక్కలకు నీరు అందిస్తున్నాం."

-హర్‌దేవ్ సింగ్, రైతు

లుధియానాలో దొరికే ఈ స్ట్రాబెర్రీలకు పంజాబ్‌ వ్యాప్తంగానే కాదు, చండీగఢ్‌లోనూ మంచి డిమాండ్ ఉంది. స్ట్రాబెర్రీలే కాకుండా, మార్కెట్లలో దొరికే ఇతర పండ్ల విత్తనాలను సైతం పొలంలో నాటాడు హర్‌దేవ్ సింగ్.

"ఇప్పుడు రకరకాల నిమ్మజాతి మొక్కలు నాటాం. ఖర్బూజా మొక్కలూ పెంచుతున్నాం. కొత్తరకం పండ్ల విత్తనాలు దొరికితే.. వాటినీ పెంచుతాం. ఇతర పండ్లతో పోలిస్తే ఇవి కాస్త భిన్నంగా కనిపిస్తాయి. బ్రొకోలి, పాలకూర సహా..ఐదు రకాల క్యారెట్లు, క్యాబేజీ లాంటి ఇంటి అవసరాలకు కావల్సిన కూరగాయలు పండిస్తాం."

-హర్‌దేవ్ సింగ్, రైతు

సేంద్రీయ పద్ధతుల్లో పండించిన స్ట్రాబెర్రీలను కొనుగోలు చేసేందుకు.. హర్‌దేవ్ సింగ్ పొలాలకు దూరప్రాంతాల ప్రజలు వస్తారు.

స్ట్రాబెర్రీల కోసమే ప్రత్యేకంగా ఇక్కడికి వస్తాన్నేను. మీకు నచ్చిన స్ట్రాబెర్రీలు ఇక్కడ కొనుక్కోవచ్చు. తాజా పండ్లు దొరుకుతాయి. మార్కెట్‌లో సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు అంత సులభంగా దొరకవు. ఇవైతే చాలా తక్కువ ధరకే అమ్ముతారు. పండ్లు రుచికరంగా కూడా ఉంటాయి. కూరగాయల నాణ్యత గురించి భయపడాల్సిన అవసరం లేదు.

-అశోక్‌ గోయెంకా, వినియోగదారుడు

హర్‌దేవ్ సింగ్ తన పొలంలో 24 రకాల కూరగాయలు పండిస్తున్నాడు. ఆయన పండించే పసుపుపచ్చ, ఊదారంగు క్యాబేజీ ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతానికి సొంత అవసరాల కోసం మాత్రమే ఈ కూరగాయలు పండిస్తున్నానని చెప్తున్నాడు హర్‌దేవ్. భవిష్యత్తులో మార్కెట్లకు విక్రయించే ఆలోచనల్లో ఉన్నాడు.

ఇదీ చదవండి :'పట్టు'దలతో మహిళల సిరుల పంట

ABOUT THE AUTHOR

...view details