Farmer died due to Covid 19: కరోనా మహమ్మారితో 8 నెలలుగా పోరాటం సాగించారు ఓ రైతు. చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు ఖర్చుకు వెనకాడలేదు. అపోలో ఆసుపత్రిలో రోజుకు రూ.3 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించారు. అందుకోసం తమకు ఉన్న 50 ఎకరాలను అమ్మేశారు. అయినా.. ఫలితం దక్కలేదు, ఆ రైతు ప్రాణాలను దక్కించుకోలేకపోయారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గత మంగళవారం రాత్రి కన్నుమూశారు ఆ రైతు.
మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలోని రకరీ గ్రామానికి చెందిన రైతు ధర్మజయ్ సింగ్(50) అనారోగ్యానికి గురవగా.. 2021, ఏప్రిల్ 30న కరోనా పరీక్షలు చేయించారు. వైరస్ సోకినట్లు మే 2న తెలిసింది. దీంతో ఆయనను జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ధర్మజయ్ బీపీ పడిపోగా.. ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు వైద్యులు. వెంటిలేటర్ అమర్చారు. ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవటం వల్ల మే 18న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు ధర్మజయ్.
దెబ్బతిన్న ఊపిరితిత్తులు
ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాతే ఆయన కరోనా నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తుల సమస్యతో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. 8 నెలల పాటు చికిత్స అందించారు. అందుకు రోజుకు రూ.3 లక్షల చొప్పున ఖర్చు చేశారు కుటుంబ సభ్యులు. ఇలా 8 నెలల్లో చికిత్స కోసం దాదాపు రూ.8కోట్లు ఖర్చు అయింది.