తెలంగాణ

telangana

ETV Bharat / bharat

60 గుంటలు- 6 కోట్ల లీటర్ల నీటి నిల్వ.. ఆ రైతు ఘనత

వర్షపు నీటిని ఒడిసిపట్టి సాగులో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు బెంగళూరు రూరల్​ జిల్లా దొడ్డబళ్లాపుర రైతు. భారీ నీటి కుంట నిర్మించి సుమారు 6 కోట్ల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేస్తూ 8 ఎకరాల్లో గులాబీలు సాగు చేస్తున్నాడు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నాడు.

Form pond
రైతు రవికుమార్​

By

Published : Mar 18, 2021, 7:16 PM IST

6 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే నీటి కుంట

దేశంలో అత్యధికంగా వ్యవసాయం బావులు, బోర్ల ఆధారంగానే సాగుతోంది. వర్షాలు పడిన సమయంలోనే పూర్తిస్థాయిలో సాగవుతోంది. ఇతర కాలాల్లో బోర్లు, బావులు అడుగంటి చుక్క నీరు రాని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపాడు కర్ణాటక బెంగళూరు రూరల్​ జిల్లా దొడ్డబళ్లాపుర రైతు. వర్షపు నీటిని ఒడిసిపట్టి అవసరమైన సమయంలో వాడుకుంటూ మంచి లాభాలు గడిస్తున్నాడు. ఇందుకోసం తన పొలంలో 6 కోట్ల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసే భారీ నీటి కుంట (ఫాం​ పాండ్​)ను నిర్మించాడు.

నీటి కుంట వద్ద రైతు రవికుమార్​

రైతు రవికుమార్​కు 20 ఎకరాల భూమి ఉంది. అందులో 8 ఎకరాల్లో పాలీహౌస్​ నిర్మించి గులాబీలు సాగు చేస్తున్నాడు. అయితే.. బావి, ఓ బోరు ఉన్నప్పటికీ అందులో సరిపడా నీరు లేదు. దాంతో రూ. 40 లక్షలు ఖర్చు చేసి 1400 అడుగుల మేర 12 బోర్లను వేయించాడు. అయినా ఫలితం లేకపోయింది.

పాలీహౌస్​లో పూల సాగు

వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతుల గురించి తెలుసుకున్నాడు రవికుమార్​. వ్యవసాయ అధికారుల సూచనలతో తన పొలంలోనే సుమారు 6 కోట్ల లీటర్ల వర్షపు నీరు నిల్వ చేసే సామర్థ్యంతో 60 గుంటల మేర భారీ నీటి కుంటను నిర్మించాడు. 2 జేసీబీలు, 10 లారీల సాయంతో 10 నెలల పాటు శ్రమించి 10 మీటర్ల లోతుతో నిర్మాణం పూర్తి చేశాడు రవికుమార్​. అందుకోసం రూ.32 లక్షలు వెచ్చించాడు.

పాలీ హౌస్​ నుంచి వర్షపు నీరు వచ్చేందుకు ఏర్పాట్లు

ఈ నీటి కుంటను ఒక్కసారి పూర్తిస్థాయిలో నింపితే.. ఏడాది పొడవునా పంటకు నీరు అందించే వీలుకలుగుతుందని చెబుతున్నాడు రైతు.

"పాలీహౌస్​లో గులాబీలు సాగు చేస్తున్నా. అంతకుముందు బావిలో నీరు సమృద్ధిగా ఉండేది. కానీ ఇప్పుడు సరిపోవటం లేదు. బోరు నుంచి కూడా తగినన్ని నీళ్లు రావటం లేదు. అందుకే వర్షపు నీటిని నిల్వ చేయాలని నిర్ణయించుకున్నా. వర్షం నీటిని సంరక్షించే పద్ధతుల గురించి పూర్తిగా తెలుసుకున్నా. మనం వర్షపు నీటిని వృథా చేయకూడదు. ఇలాంటి నీటి కుంటను నిర్మించుకుంటే.. బోరు బావి అవసరం ఉండదు. "

- రవికుమార్​, రైతు

విదేశాలకు ఎగుమతి..

తన పాలీహౌస్​లో 12 రకాల గులాబీలు సాగు చేస్తున్నాడు రవికుమార్​. వాటిని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు. అంతేకాదు.. 150 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నాడు.

పాలీహౌస్​లో పని చేస్తున్న కూలీలు

ఇదీ చూడండి:ఐటీ ఉద్యోగం వీడి.. సేంద్రీయ సాగులోకి..

ABOUT THE AUTHOR

...view details