తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆదర్శ రైతన్న- వర్షపు నీటి కోసం 6కోట్ల లీటర్ల కుంట

వ్యవసాయానికి నీరే ప్రధానం. అలాంటి నీటి కోసం రైతులు ఏమైనా చేస్తారు. కర్ణాటకకు చెందిన ఓ పూల రైతు సాగు కోసం ఏకంగా ఆరు కోట్ల లీటర్లు నిల్వ చేసే భారీ కుంటను తవ్వించారు. వర్షాకాలంలో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి.. తన పూలమొక్కల సాగుకు వినియోగిస్తున్నారు. అలా అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

FARMER BUILT A HUGE FARM POND WHICH CAN STORE 6 CRORE LITERS OF RAIN WATER IN KARNATAKA
ఆదర్శ రైతన్న:వర్షపు నీటి కోసం 6 కోట్ల లీటర్ల కుంట

By

Published : Mar 27, 2021, 10:20 AM IST

ఆదర్శ రైతన్న:వర్షపు నీటి కోసం 6 కోట్ల లీటర్ల కుంట

ఈ వ్యక్తి ఓ రైతు. పూలతోటలు పెంచుతారు. సరైన మోతాదులో నీరు అందించకపోతే పూల మొక్కలు ఎండిపోతాయి. అందుకోసం 40 లక్షలకు పైగా ఖర్చుపెట్టి, తన పొలంలో 12 బోరు బావులు తవ్వించారు. కనీసం భూమి కూడా తడవలేదు. అయినా వెనక్కు తగ్గలేదు. ప్రత్యామ్నాయం కోసం పరిశోధన చేసి, 6 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే కుంటను స్వయంగా నిర్మించుకున్నారు.

కర్ణాటకలోని దొడ్డా హెజ్జాజీ గ్రామానికి చెందిన రవికుమార్ తన 8 ఎకరాల పాలీహౌజ్‌లో గులాబీ మొక్కలు పెంచుతున్నారు. ఈయన తోటల నుంచి గులాబీ పూలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. స్థానిక మార్కెట్లలోనూ వాటిని విక్రయిస్తున్నారు రవికుమార్. ఫ్లోరికల్చర్ ద్వారా లక్షల రూపాయల ఆదాయం గడిస్తున్న ఈ రైతు...150 మందికి పైగా ఉపాధి కల్పించారు. తనకున్న 20 ఎకరాల వ్యవసాయ భూమిలో 8 ఎకరాల్లో 12 రకాల రోజా పూల మొక్కలు పెంచుతున్నారు.

"వర్షాకాలంలో నీరంతా వృథాగా పోతుంది. అది చూస్తే నాకు బాధేస్తుంది. అందుకే చెరువు కట్టి, నీటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నా. అందుకోసం సరైన భూమి కావల్సి ఉంటుంది. 6 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యమున్న కుంటను నిర్మించాను. అప్పట్లో అయితే 1400 అడుగుల లోతుకు తవ్విన బోరుబావి నుంచి కూడా నీరు వచ్చేది కాదు. ప్రస్తుతం నా ఫ్లోరీకల్చర్ కోసం పూర్తిగా వాననీటినే వాడుకుంటున్నా."

-రవికుమార్, రైతు

రవికుమార్ ఇప్పటివరకూ తన పొలంలో 12 బోరుబావులు తవ్వారు. గతంలో 40 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి, 1400 అడుగుల లోతు వరకు తవ్వినా.. చుక్క నీరు రాలేదు. అందుకే నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషించారు రవికుమార్. ఆ సమయంలోనే వాననీటి సంరక్షణ చేపట్టాలన్న ఆలోచన తట్టింది. రెండునెలల పాటు శ్రమించి, 32 లక్షల రూపాయలు ఖర్చు చేసి 10 మీటర్ల లోతైన కుంట నిర్మించుకున్నారు.

"ఈ కుంట నిర్మించడానికి నెలన్నర నుంచి 2 నెలల సమయం కేటాయించాను. 32 లక్షల రూపాయలు ఖర్చుచేసి, 2 హిటాచీ, 10 లారీలు, ఒక జేసీబీ వినియోగించి దీన్ని కట్టాను. 12 బోరుబావులు తవ్వేందుకు 35 నుంచి 40 లక్షల రూపాయల ఖర్చైంది. ప్రతి పాలీహౌజ్‌కు నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేశా. ఆ పైపుల గుండా నీరు కుంటలోకి వెళ్తుంది."

-రవికుమార్, రైతు

వాననీరంతా పైపుల ద్వారా కుంటలోకి చేరేలా ఏర్పాట్లు చేశారు రవికుమార్. కుంట ఓసారి పూర్తిగా నిండితే వచ్చే ఏడాది వరకూ నీటి కొరత ఉండదని చెప్తున్నారు. బోరునీటిలో ఉప్పుశాతం ఎక్కవగా ఉంటుందని, పంటలకు ఈ నీరు తగదంటున్న రవికుమార్.. వాననీటితో పంట దిగుబడి కూడా అధికంగా వస్తుందంటున్నారు.

ఇదీ చూడండి: ఐటీ ఉద్యోగం వీడి.. సేంద్రీయ సాగులోకి..

ABOUT THE AUTHOR

...view details