తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీడని ప్రతిష్టంభన - 2 అంశాలపై ఏకాభిప్రాయం - రైతుల ఆందోళన

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుసంఘాలతో కేంద్రం జరిపిన చర్చల్లో స్వల్ప పురోగతి లభించింది. వాయునాణ్యత నిర్వహణ కమిషన్‌ ఆర్డినెన్స్‌, విద్యుత్ బిల్లులో సవరణలపై ఏకాభిప్రాయం కుదరగా అన్నదాతల ప్రధాన డిమాండ్లు అయిన నూతన సాగుచట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అంశాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించేందుకు జనవరి 4న మరోసారి సమావేశం కావాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి.

Farm stir: Govt accepts demand on power, pollution laws; talks now on Jan 4
వీడని ప్రతిష్టంభన - రెండు అంశాలపై ఏకాభిప్రాయం

By

Published : Dec 30, 2020, 11:27 PM IST

సాగుచట్టాలకు వ్యతిరేకంగా నెలరోజులకు పైగా దిల్లీ సరిహద్దుల్లో పోరుబాట సాగిస్తున్న అన్నదాతలతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో కాస్త ముందడగు పడింది. విజ్ఞాన్ భవన్ వేదికగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందానికి, 41 రైతు సంఘాలకు మధ్య ఐదుగంటలపాటు జరిగిన ఆరో విడత చర్చల్లో ఈ మేరకు పురోగతి వచ్చింది. వ్యవసాయ చట్టాలరద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, దిల్లీలో వాయు నాణ్యత ఆర్డినెన్స్‌, విద్యుత్‌ బిల్లులలో సవరణలకు రైతులు పట్టుబట్టగా, గాలి నాణ్యత ఆర్డినెన్స్‌, విద్యుత్‌ బిల్లులలో సవరణలకు ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్..సగం అంశాలపై ఏకాభిప్రాయం సాధించామని, మిగతా రెండింటిపై చర్చించేందుకు జనవరి 4న మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.

"సమావేశంలో రైతులు చర్చకు ఉంచిన నాలుగు అంశాల్లో రెండింటిపై ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పర్యావరణంతో సంబంధం ఉన్న ఆర్డినెన్స్‌లోని అంశాలపై రైతులు ఆందోళనగా ఉన్నారు. రైతులు ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి రావద్దని వారి భావన. ఈ అంశంలో ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. విద్యుత్‌ చట్టంలోని సంస్కరణలు అమలులోకి వస్తే తమకు నష్టం కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. ఈ అంశంపై కూడా ఏకాభిప్రాయం కుదిరింది."

-నరేంద్ర సింగ్‌ తోమర్‌, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

నిరసనలను శాంతియుతంగా, క్రమశిక్షణతో నిర్వహించడాన్ని ప్రశంసించిన మంత్రి చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా వృద్ధులను, మహిళలను, చిన్నారులను స్వస్థలాలకు పంపాలని రైతుసంఘాలను కోరారు. సాగుచట్టాల రద్దుకే రైతుసంఘాలు పట్టుబడుతున్నాయన్న తోమర్ వాటి ప్రయోజనాలను వివరించి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. కనీస మద్దతు ధరపై లిఖిత పూర్వక హామీకి సిద్ధమని కేంద్రమంత్రి తెలిపారు.

నాలుగు అంశాలపై చర్చ జరిగింది. వాటిలో రెండింటికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కమిటీ ఏర్పాటుపై చర్చ జరగలేదు. జనవరి 4 న మళ్లీ సమావేశం అవుతాం. ఈ చర్చల్లో మూడు నూతన సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అంశాలపై జనవరి 4న చర్చిస్తాం. ఆందోళన కొనసాగుతుంది. శాంతి పూర్వకంగా నిరసన తెలుపుతాం

-రాకేశ్‌ టికాయట్‌ భారత కిసాన్‌ యూనియన్‌ నాయకుడు

చర్చల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ముందు పలు ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. చర్చలు ముందుకెళ్లాలంటే ఆందోళన విరమించాలని రైతులను కేంద్రం కోరింది. సాగు చట్టాల ఉపసంహరణ కుదరదని, రైతుల డిమాండ్లపై చర్చల కోసం మరోసారి కమిటీ ఏర్పాటును కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే సాగు చట్టాల రద్దుకే పట్టుబట్టిన రైతు సంఘాలు ఆందోళనల్లో మరణించిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేశాయి.

ఇదీ చదవండి :సాగు చట్టాలపై రైతుల బతుకు పోరాటం

ABOUT THE AUTHOR

...view details