కర్షకుల పోరాటం ఫలించింది. కేంద్రం దిగి వచ్చింది. వివాదాస్పద సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు (farm laws repeal) స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అయితే, మోదీ ప్రకటనతో చట్టాలు రద్దు అయినట్లు కాదు. దీనికీ రాజ్యాంగ ప్రక్రియ (farm law repeal process) పాటించాల్సి ఉంటుంది. చట్టాలను ఆమోదించిన తరహాలోనే.. వాటిని ఉపసంహరించేటప్పుడు (farm laws withdrawn) సైతం పార్లమెంట్లో సంబంధిత ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చట్టాల ఉపసంహరణ (farm laws taken back) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టాలి.
"రాజ్యాంగం ప్రకారం చట్టాలను తయారు చేసిన విధంగానే వాటిని రద్దు చేయాల్సిన ప్రక్రియ ఉంటుంది. చట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాలి. ఈ బిల్లు పాసైతే.. చట్టంగా మారుతుంది. మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయలేదు. కానీ అవి పార్లమెంట్ గడప దాటి రాష్ట్రపతి ఆమోదం పొందిన చట్టాలే. కాబట్టి, వాటిని పార్లమెంట్ మాత్రమే ఉపసంహరించగలదు."
-పీకే మల్హోత్రా, కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి
ఒకే బిల్లుతో మూడు...
బిల్లు ప్రవేశపెట్టడం మినహా చట్టాలను ఉపసంహరించుకునేందుకు మరో మార్గం లేదని లోక్సభ మాజీ ప్రధాన కార్యదర్శి పీడీటీ ఆచార్య తెలిపారు. ఒకే ఉపసంహరణ బిల్లుతో మూడు చట్టాలను తొలగించవచ్చని చెప్పారు. చట్టాలను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారనే విషయాన్ని బిల్లులో తెలియజేయాలని వివరించారు.