Farm Laws Repeal: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత 'సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే కుట్రను భాజపా నేతలు అమలు చేస్తారేమోన'నే సందేహాన్ని వ్యక్తం చేసింది. 'సాగు చట్టాలపై ముందడుగు వేస్తామంటూ వ్యవసాయ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీ క్షమాపణలను అవమానించేలా ఉన్నాయి. ఇది గర్హణీయం' అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Congress on Narendra Singh Tomar Statement:
'రైతు వ్యతిరేక చర్యలు తీసుకున్నట్లయితే అన్నదాతలు మళ్లీ సత్యాగ్రహం ప్రారంభిస్తార'ని రాహుల్ గాంధీ హెచ్చరించారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలనే కుట్ర తోమర్ వ్యాఖ్యలతో బహిర్గతమైందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. 'ప్రధాని మోదీ, భాజపా, ఆర్ఎస్ఎస్ సంయుక్త పన్నాగాన్ని మేం ముందే ఊహించాం' అని పేర్కొన్నారు. ఈ కుట్రను నిలువరించాలంటే ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో భాజపాను ఓడించాలని రైతులకు, ప్రజలకు సుర్జేవాలా విజ్ఞప్తి చేశారు.
Farm Laws News: నాగ్‌పుర్‌లో శుక్రవారం జరిగిన అగ్రో విజన్ ఎక్స్‌పో కార్యక్రమంలో నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అతిపెద్ద సంస్కరణ జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చాం. కానీ కొందరికి(విపక్షాలను ఉద్దేశిస్తూ) ఈ సంస్కరణలు నచ్చలేదు. అందుకే నల్ల చట్టాలుగా ప్రచారం చేసి వాటిని రద్దు చేయించారు. కానీ ప్రభుత్వం ఏం అసంతృప్తి చెందడం లేదు. మేం ఒక అడుగు వెనక్కి వేశాం. కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తాం. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక" అని అన్నారు.
తోమర్ వివరణ