Farm laws committee report: మూడు వ్యవసాయ చట్టాలపై అధ్యయనానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను అందులోని ఒక సభ్యుడు బయటపెట్టారు. సాగుచట్టాలు రద్దు చేయవద్దని, అవి రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని గతేడాది మార్చి 19న సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో ఉంది. కనీస మద్దతు ధరపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వడం సహా చట్టాలకు చాలా సవరణలను ముగ్గురు సభ్యుల కమిటీ సూచించింది.
'సాగు చట్టాలకు మెజార్టీ రైతుల మద్దతు'.. 'సుప్రీం' నివేదిక బహిర్గతం - కమిటీ నివేదిక బహిర్గతం
Farm laws committee report: కేంద్రం ఇటీవల రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలపై అధ్యయనానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బహిర్గతమైంది. గత ఏడాది మార్చి 19న సుప్రీంకోర్టుకు అందించిన నివేదికను బయటపెట్టారు ప్యానల్ సభ్యుడు ఒకరు. చట్టాలను రద్దు చేసినందున.. ఈ నివేదికను దాచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
నివేదికను కోర్టుకు అందించిన తర్వాత దాన్ని బయటపెట్టాలని మూడు సార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని ప్యానెల్ సభ్యులలో ఒకరైన అనిల్ ఘన్వత్ తెలిపారు. చట్టాలు రద్దు చేసినందున.. ఈ నివేదికను దాచాల్సిన అవసరం లేదని అన్నారు. భవిష్యత్‌లో వ్యవసాయ రంగంలో విధివిధానాలు రూపొందించేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని ఘన్వత్ అభిప్రాయపడ్డారు. చట్టాలను సమర్థించేవారు మౌనంగా ఉండటం వల్ల.. వాటి రద్దుతో వారికి.. అన్యాయం జరుగుతుందని నివేదికలో తెలిపారు. కమిటీకి వినతులు ఇచ్చిన 73 రైతు సంఘాల్లో 3.3కోట్ల మంది రైతులకు ప్రాతినిధ్యం వహించే 61 సంఘాలు చట్టాలకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని 40 సంఘాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. వారి అభిప్రాయాలు చెప్పలేదని ఘన్వత్ తెలిపారు.
ఇదీ చూడండి:మహిళ మెడలో గొలుసు కొట్టేస్తూ దొరికిన 'మిస్టర్ ఇండియా'!