Tributes to NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. రాజకీయ, సినీ రంగాల్లో ఎన్టీఆర్ అద్భుతంగా రాణించారని మోదీ కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీ రంగంలో ఖ్యాతిగాంచారని మోదీ తెలిపారు. ఎన్టీఆర్ కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ 300కు పైగా చిత్రాల్లో నటించి అలరించారన్నారు. తన నటనతో అనేక పౌరాణిక పాత్రలకు జీవం పోశారని.. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనను ఇప్పటికీ స్మరిస్తారని వెల్లడించారు. ఎన్టీఆర్ లక్షలాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని తెలిపారు. శత జయంతి వేళ ఎన్టీఆర్‌కు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని మోదీ తెలిపారు.
తెలుగుజాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన ఘనుడు: "నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు నందమూరి తారక రామారావు".. అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో అనుబంధం తనకెప్పుడూ చిరస్మరణీయం అని తెలిపారు. రామారావు శత జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల్లో నిలిచిన అజేయుడు: తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. చరిత్ర మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. శత జయంతి వేళ ఆయనకు అంజలి ఘటించిన పవన్ కల్యాణ్.. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికార కైవసం చేసుకున్నారని ప్రశంసించారు. దిల్లీ రాజకీయాల్లో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి 'ఆత్మ గౌరవం' అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం సాధించారన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలు ఎందరికో అనుసరణీయంగా మారాయని పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్.. తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు.