Family Members are Worried About Chandrababu's Health : రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో అపరిశుభ్ర పరిసరాల వల్ల చంద్రబాబు ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ట్వీట్ చేశారు. తన భర్త చంద్రబాబుకు అవసరమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త క్షేమం గురించి చాలా ఆందోళనగా ఉన్నట్లు భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారని తెలిపారు. జైల్లో అపరిశుభ్ర వాతావరణం, అపరిశుభ్రమైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు ఉన్నాయని... ఆ నీళ్ల వినియోగంతో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నట్లు కోడలు నారా బ్రాహ్మణి ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులంతా తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు చెప్పారు. ఆయనకు అత్యవసరంగా వైద్యం అందించాలని కోరారు.
భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.. చంద్రబాబు పై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు కి ఏదైనా హాని జరిగితే, అందుకు జగన్మోహన్ రెడ్డి దే బాధ్యత అని హెచ్చరించారు. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఆయనకు తగిన భద్రత లేనందున ఆయన ఎంతో ప్రమాదంలో ఉన్నారన్నారు. దోమలు, కలుషిత నీరు, బరువు తగ్గడం, ఇన్‌ఫెక్షన్‌లు, అలర్జీలు ఉన్నా సకాలంలో వైద్య సహాయాన్ని అందించట్లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం విఫలం..జైల్లో తన భర్తకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ఆరోపించారు. తన భర్త క్షేమం గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని ఆమె తెలిపారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారన్న ఆమె... ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని ఆవేదన చెందారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అన్నారు. ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.