Family Mass Suicide :ఆర్థిక సమస్యలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు వృద్ధులు ఉన్నారు. గుజరాత్లో జరిగిన ఈ ఘటన.. సంచలనం రేపింది. మృతులను మనీశ్ సోలంకి, అతడి తండ్రి కనుభాయి, తల్లి శోభనాబెన్, భార్య రీతా, పిల్లలు దీక్ష, కావ్య, కౌశల్‌గా గుర్తించారు.
ఇదీ జరిగింది..
సూరత్‌లోని పలన్పుర్ పటియా ప్రాంతానికి చెందిన మనీశ్ సోలంకి.. తన కుటుంబంతో కలిసి సిద్దేశ్వర్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. ఇతడు ఫర్నీచర్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, మనీశ్ కొన్ని రోజుల క్రితం.. కొందరికి నగదును అప్పుగా ఇచ్చాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా.. వారు ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పుగా ఇచ్చిన డబ్బు వెనక్కి వచ్చేలా లేకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన మనీశ్ అత్మహత్యకు సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి తల్లిదండ్రులతో పాటు భార్యాపిల్లలకు విషం ఇచ్చాడు మనీశ్. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే, మనీశ్ ఇంట్లో నుంచి వాసన రావడం వల్ల అనుమానించిన స్థానికులు వెళ్లి తలుపు కొట్టారు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
"ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్‌ను రాశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం."
--రాకేశ్ బరోత్, సూరత్ డీసీపీ