ఆరేళ్లుగా ఓ కుటుంబం.. గుంతలో నివసిస్తోంది. కనీసం తాగడానికి సరైన నీరు కూడా లేదు. గత ఆరేళ్లుగా వీరికి ఏ ప్రభుత్వ పథకం కూడా అందడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సైతం అందక నానా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఈ కుటుంబం.. బంగాల్ జల్పాయ్‌గుడిలోని అముగ్రి శివారులో ఛాప్గఢ్ గ్రామంలో ఉంటోంది.
కూలీ పనులు చేసుకుంటూ జీవించే లక్ష్మీ మోహన్ రాయ్‌కు పక్కా ఇల్లు లేదు. ఓ రేకుల షెడ్డులోని జీవనం సాగిస్తున్నాడు. వర్షం, తుపాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ఇల్లు పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో ఐదుగురు ఉన్న మోహన్ రాయ్ కుటుంబం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అధికారులు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో రేకుల షెడ్డులోనే ఓ గుంతను తవ్వి భార్యభర్తలు సహా ఇద్దరు బాలికలు, అత్త ఐదుగురు అందులో తల దాచుకుంటున్నారు. ఈ కుటుంబానికి సరైన నీటి సదుపాయం కూడా లేదు. ఇంటి సమీపంలోనే ఓ చిన్న బావిని తవ్వుకుని ఆ నీటినే తాగుతున్నారు.
'ఇప్పటికే అనేక సార్లు కొట్టుకుపోయింది'
"ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే మా గురించి వెతుకుతారు. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునేవారే ఉండరు. చాలా కష్టపడి ఈ ఇల్లును కట్టుకున్నాం. అంతకుముందు ఉన్న ఇల్లు అనేక సార్లు గాలికి కొట్టుకుపోయింది. వర్షాలు, గాలులు, తుపానులు వచ్చినప్పుడు మా పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది." అని లక్ష్మీ మోహన్‌రాయ్ అత్త శోభా రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభత్వ అధికారులు తమను పట్టించుకుని పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుతోంది.