Khammam Accident Killed a Family Today : ఒక్కగానొక్క కుమారుడు. ఉన్నత చదువులు చదివి.. హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్ స్థాయిలో స్థిరపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్నంతలో గొప్పగా జీవిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు సొంతూరిలోనే ఉంటూ.. చేతనైనంతలో వ్యవసాయాన్ని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడికి సెలవులు దొరికినప్పుడు కన్నవారి వద్దకు వచ్చి.. వారి బాగోగులు చూసుకుని వెళ్లేవాడు.
ఇలా సాఫీగా.. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాలను ఒక్క రోడ్డుప్రమాదం కకావికలం చేసింది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకుతో పాటు కోడలు, ఓ మనవడిని దూరం చేసింది. మరో మనవడిని ఆసుపత్రి పాలు చేసింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో దంపతులు రాజేశ్-సుజాత సహా వారి కుమారుడు అశ్విత్ అక్కడికక్కడే మృతి చెందగా.. పెద్ద కుమారుడు దివ్యతేజ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Car Accident Today in Khammam :'స్కూళ్లకు వేసవి సెలవులు ఉన్నాయి కదరా.. మనవళ్లను చూడాలని ఉంది. ఒక్కసారి ఇంటికి వచ్చి పోరా. నిన్ను-కోడల్ని చూసి కూడా చాలా రోజులవుతుంది. వీలు చూసుకుని ఒక్కసారి వచ్చిపోరా' అన్న తండ్రి మాటలతో ఆ కుమారుడు విధులకు సెలవు పెట్టాడు. రాత్రి వేళల్లో అయితే వాహనాల రద్దీ తక్కువగా ఉంటుందని ఫ్యామిలీని తీసుకుని బుధవారం రాత్రి కారులో సొంతూరికి బయలుదేరాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో పిల్లలిద్దరూ వెనక సీట్లో హాయిగా నిద్రపోతున్నారు. ముందు సీట్లో ఉన్న దంపతులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతలోనే నాన్న ఫోన్ చేస్తే.. ఇంకో 15 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం డాడీ అని రాజేశ్ చెప్పాడు.
Couple Died in Car Accident :కాసేపట్లో నా కొడుకు-కోడలు మనవళ్లతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది. పిల్లలు ఉన్నన్ని రోజులు నా ఇల్లు కళకళలాడుతుంది అనుకుంటూ మురిసిపోతున్న ఆ తండ్రికి అంతలోనే ఓ ఫోన్ వచ్చింది. హలో అనగానే.. అవతలి వ్యక్తి గుండె పగిలే వార్త చెప్పాడు. 'కొనిజర్ల వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మీ కొడుకు, కోడలు, ఓ మనవడు చనిపోయారు. మరో మనవడికి తీవ్ర గాయాలయ్యాయి' అన్న మాటలతో ఒక్కసారిగా హతాశుడయ్యాడు. హుటాహుటిన భార్యను తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడి పరిస్థితిని చూసి ఆ వృద్ధ దంపతులు గుండెలవిసేలా రోదించారు. 'నేనే మిమ్మల్ని చంపుకున్నాను.. ఇంటికి రమ్మనకున్నా సిటీలో హాయిగా ఉండేవాళ్లు బిడ్డా' అంటూ ఆ తండ్రి ఏడ్చిన తీరు అక్కడి వారి గుండెలు బరువెక్కేలా చేసింది.